జగిత్యాల : జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ విధులు నిర్వర్తిస్తూనే తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు. వినాయక నిమజ్జనం బందోబస్తు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే తన కూతురును ఎత్తుకుని లాలించారు. కూతురుని ఎత్తుకుని గణేష్ నిమజ్జనాలను చూపిస్తూ.. మరోవైపు బందోబస్తును పర్యవేక్షించారు. ఓవైపు వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని మరీ విధులు నిర్వర్తించారు. ఓవైపు తల్లిగా మరోవైపు పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీ నిర్వహించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సింధు శర్మ.. మహబూబాద్ జిల్లా కలెక్టర్ శశాంక సతీమణి కావడం గమనార్హం.
సింధు శర్మ.. జగిత్యాల జిల్లా ఎస్పీగా ఈ మధ్యే నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 5వ తేదీన సింధు శర్మ జగిత్యాల ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జగిత్యాల జిల్లాలో సిన్సియర్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.