బైక్ ను ఢీకొట్టి గుంతలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు... ఇద్దరి పరిస్థితి విషమం

బైక్ ను ఢీకొట్టి ఆర్టీసీ బస్సు గుంతలోకి దూసుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వైపు వెళ్తుంది. అయితే అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు సోమిశెట్టి వెంకటి, సోమిశెట్టి వెంకటేష్ జగిత్యాల నుండి వెంకటాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో  బైక్ పై వెళుతున్న వారు వెంకటాపూర్ క్రాస్ రోడ్ వద్ద తమ ఊళ్లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో జాతీయ రహదారిపై జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది.

వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బైక్ ను తప్పించే ప్రయత్నంలో.. బైక్ ను ఢీకొట్టిన అనంతరం రహదారి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు బస్సు అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను బయటకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో  బైక్ పై ప్రయాణిస్తున్న వెంకటి, వెంకటేష్ లకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారిఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన చికిత్స కోసం కరీనంగర్ కు తరలించారు. బస్సులోని ప్రయాణికులలో కొందరికి గాయాలవడంతో వారిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.