జగిత్యాల జిల్లా : జగిత్యాల నూతన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయిస్తానని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ పై రెతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలుగుతుందంటే మాస్టర్ ప్లాన్ కు తాను కూడా వ్యతిరేకమని అన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగిత్యాలలోని విజయపురికాలనీలో చాలావరకు అక్రమంగా ఇండ్లు కట్టారని, ఆ సమయంలో ఆ ప్రాంతం ఇండస్ట్రియల్ కింద ఉండేదన్నారు. అక్రమ లే అవుట్లకు కాంగ్రెస్ వాళ్లే పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. అభివృద్ధి కోసమే లింగం పేట్, నర్సింగాపూర్ తో పాటు మరికొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలిపామని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సంజయ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు.
తమ పార్టీ సర్పంచులు ఆవేదనలో, ఆవేశంతో ఉన్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. అభివృద్ధి చేస్తామంటేనే తీర్మానం చేశామని, ఇండస్ట్రియల్, ఫ్యాక్టరీల నిర్మాణం కోసం మాత్రం కాదన్నారు. మాస్టర్ ప్లాన్ పై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు మాస్టర్ ప్లాన్ లేదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే జగిత్యాల పట్టణాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.