రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులు తన చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. తనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేనని, చిన్నప్పుడే జెండా పట్టుకుని తిరిగానని, ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ, రాజకీయాల్లో తిరిగానని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడవద్దని, అలా తాను కూడా మాట్లాడుతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ముందు ఆలోచించుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నిస్తే మాత్రమే అభివృద్ధి జరగదని.. ముందుండి పని చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాను ముమ్మాటికి జగిత్యాల ప్రజల పక్షాన ఉంటానన్నారు. రైతుల పక్షాన నిలబడతానని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం కాదు.. దమ్ముంటే రైస్ మిల్లర్ల ఎదుట నిరసన చేపట్టాలి. ప్రతిపక్ష పార్టీల నాయకుల బంధువుల పేర రైస్ మిల్లులు ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్లు ధర్నా చేయడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.