మెట్ పల్లి/రాయికల్/మల్లాపూర్, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని, పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగిందని, జాలర్లు, ప్రజలు గోదావరిలోకి దిగొద్దని సూచించారు. అనంతరం ములరాంపూర్ వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై అనిల్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలోని గోదావరిని అడిషనల్ కలెక్టర్ గౌతంరెడ్డి పరిశీలించారు.
మంథనిలో కలెక్టర్ పర్యటన
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయ పరిసరాలను అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ కురుస్తున్న వానలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని, సాయంత్రం నుంచి నీరు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.