మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. ఓ వైపు ఆకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను రైస్ మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారు. తూకం పేరుతో తమను దోచుకుంటున్నారని పురుగుల మందు డబ్బాలతో రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో రైస్ మిల్లర్లు అగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తూకం పేరుతో రైతులను నిండా ముంచుతున్నారు. బస్తాకు మూడు కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ధర్నాకు దిగారు. న్యాయం చేయాలంటూ జగిత్యాల రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన చేపట్టారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని భైఠాయించారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలన్ని ఆగిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.