చెల్లెలు అదృశ్యం.. సోఫాలో అక్క శవం

  • చెంప, చేతిపై గాయాలు 
  • ఎడమ చేయి విరిచిన ఆనవాళ్లు
  • జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన 

కోరుట్ల,వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోగా ఈమె చెల్లెలు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ కాలనీకి చెందిన బంక శ్రీనివాస్​రెడ్డి–-మాధవి దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్ద కూతురు దీప్తి(24) సాఫ్ట్​వేర్​ఇంజినీర్‌‌‌‌(వర్క్​ఫ్రమ్​హోం) చేస్తోంది. చిన్న కూతురు చందన హైదరాబాద్​లో ఇటీవలే ఇంజినీరింగ్​పూర్తి చేసింది. కొడుకు సాయికుమార్ ​బెంగళూరులో డిగ్రీ చేస్తున్నాడు. కాగా, తల్లిదండ్రులిద్దరూ బంధువుల గృహ ప్రవేశానికి ఆదివారం హైదరాబాద్‌‌ వెళ్లగా కూతుళ్లిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు తండ్రి శ్రీనివాస్‌‌రెడ్డి ఫోన్​చేసి కూతుళ్లతో మాట్లాడాడు. మంగళవారం ఉదయం మళ్లీ కాల్​చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్​వచ్చాయి. 

అనుమానం వచ్చిన ఆయన మధ్యాహ్నం పక్కింటివారికి ఫోన్​చేసి తన కూతుళ్లతో మాట్లాడించమని అడిగారు. దీంతో వారు శ్రీనివాస్​రెడ్డి ఇంటికి వెళ్లి చూడగా వరండాలోని సోఫాలో పెద్ద కూతురు దీప్తి చనిపోయి ఉంది. పరిశీలించగా చెంపపై, చేతిపై గాయాలున్నాయి. ఎడమ చేయి విరిచిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చిన్న కూతురు చందన కనిపించలేదు. వెంటనే వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ALSO READ :ఒకరికి జ్వరం.. మరొకరి గాయం.. ఆసియా కప్ నుండి మరో ఇద్దరు ఔట్

పోలీసులు వచ్చి సీసీ ఫుటేజీలు పరిశీలించగా చందన మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు  తలుపుకు గడియ పెట్టి లగేజీ తీసుకుని ఓ యువకుడితో బస్టాండ్‌‌ కు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో ఆమె జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె దొరికితేనే ఘటనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి, సీఐలు ప్రవీణ్​కుమార్, లక్ష్మీనారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. ఇంట్లో కూల్​డ్రింక్స్, మరికొన్ని డ్రింక్స్​బాటిల్స్​ఉండడంతో సోమవారం రాత్రి ఇంట్లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరగ్గా దీప్తి చనిపోయిందేమోనని అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్​కుమార్​ తెలిపారు. ​       ​