- భార్యను కాపురానికి తీసుకురావడం లేదని కోపంతోనే..
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన
మెట్ పల్లి, వెలుగు : భార్యను కాపురానికి తీసుకురావడం లేదని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి కుటుంబసభ్యులపై కత్తితో దాడి చేశాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఈ సంఘటన జరిగింది. ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం..పట్టణంలోని ఆరపేట్ కు చెందిన ఎండీ రిజ్వాన్ ఖాన్ (61) దంపతుల రెండో కొడుకు ఎండీ అక్బర్ ఖాన్ (28) పన్నెండేండ్ల క్రితం మెట్ పల్లికి చెందిన యువతిని పెండ్లి చేసుకున్నాడు. అక్బర్ తాగుడుకు బానిసై రోజూ భార్యను కొట్టేవాడు. దీంతో ఆమె నాలుగేండ్ల కింద అతడిని వదిలేసి తల్లిగారింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. దీంతో గత ఏడాది నుంచి తన భార్యను కాపురానికి తీసుకురావాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు.
కొన్నిసార్లు తల్లిదండ్రులు, చెల్లెళ్లపై దాడి కూడా చేశాడు. బుధవారం మధ్యాహ్నం తన భార్యను వెంటనే తీసుకురావాలని, లేకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. కిచెన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ పైపు తీసేసి గ్యాస్ లీక్ చేసి నిప్పు పెడతానని భయపెట్టాడు. దీంతో తల్లి, చెల్లెళ్లు ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుతుండగా అడ్డుకొని దాడి చేశాడు. అక్కడే ఉన్న తండ్రి రిజ్వాన్ ఖాన్ అడ్డుకోగా కత్తితో ఛాతి, కడుపు, వీపుపై పొడిచాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న రిజ్వాన్ఖాన్ను కుటుంబసభ్యులు సివిల్ దవాఖానకు తరలించారు. అక్బర్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో బేడీలు వేసి సివిల్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.