జగిత్యాల జిల్లాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 42 బైక్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటా తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతిఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన అనుమతి పత్రాలు లేని 42 బైక్ లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని వాహనాల తనిఖీ చేపట్టారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఏడుగురు ఎస్ ఐలు, ముగ్గురు సీఐ, 50 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. కొందరు నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను రహస్యంగా ఉంచుతారని అన్నారు. ముఖ్యంగా ప్రతీఒక్కరూ డ్రైవింగ్‌లైసెన్స్‌తో పాటు తమ వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, వాహన దారుని పేరు మీద తన వాహనం ఉండాలని అన్నారు. గ్రామంలో క్రైమ్ రేటు పెరగటంతో ఈ తనిఖీలు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.