జగిత్యాల జిల్లా ప్రజావాణిలో ఓ వృద్ధుడు వినూత్న నిరసన తెలిపాడు. చెవుల మల్లయ్య అనే వ్యక్తి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని మెడలో బోర్డు వేసుకుని కలెక్టరేట్ ముందు బైఠాయించాడు. వృద్ధుడి వినూత్న నిరసన ప్రస్తుతం వైరల్ అయింది.
వివరాల్లోకి వెళ్తే..
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనే వృద్ధుడి ఇంటికి వెళ్ళే దారిని సర్పంచ్, మరికొందరు కలిసి మూసి వేశారట. తాను గత 40 ఏళ్ల క్రితం ఇంటి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నానని..అయితే ఇప్పుడు ఆ ఇంటికి దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్పంచ్ మరికొంతమంది తన ఇంటికి రానివ్వకుండా.. పోనివ్వకుండా జేసీబీ సహాయంతో కందకం తవ్వారని కన్నీరుపెట్టుకున్నాడు. మూడు నెలలుగా సర్పంచ్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని..తనను చంపుతామని బెదిరిస్తున్నాడని తెలిపాడు. దీనిపై జగిత్యాల జిల్లా ఎస్పీ, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. అందుకే ఈ విధంగా నిరసన తెలుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరు కొడుకులు ఉపాధి కోసం గల్ఫ్ దేశం పోయారని..తాను తన భార్య జీవిస్తున్నామని వృద్ధుడు బాధపడుతూ వెల్లడించాడు.
చెవుల మల్లయ్య నిరసనపై ఆర్డీవో మాధురి స్పందించారు. సమస్యకు పరిష్కారం చూపుతామని పోలీసులు, ఆర్డీవో మాధురి హామీ ఇవ్వడంతో వృద్ధుడు ఇంటికి వెళ్లాడు.