- జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌లో ఘటన
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నర్సులు, సిబ్బంది డ్యూటీలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేట్‌షెం వార్డుల మధ్యలో ఉన్న ఓ గదిలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకొని నర్సులు, సిబ్బంది శుక్రవారం డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించారు. విపరీతమైన సౌండ్ కారణంగా ఇబ్బంది కలగడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆర్‌ఎంవో సుమన్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే నర్సులు, సిబ్బంది రిక్వెస్ట్ చేయడం వల్లే డ్యాన్స్ చేసుకునే అవకాశం ఇచ్చానని ఆర్ఎంవో సుమన్ తెలిపారు. రోగులకు ఇబ్బంది కలిగిస్తూ, డ్యూటీ టైంలో డ్యాన్స్‌లు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నాయకులు జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములుకు ఫిర్యాదు చేశారు. డ్యూటీ టైంలో డ్యాన్స్‌లు చేయడం సరికాదని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.