- పెండింగ్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ఏటా తగ్గుతున్న సాగు..
- అకాల వర్షాలతో రాలిన మామిడి కాయలు ఆందోళనలో రైతులు
జగిత్యాల, వెలుగు : జగిత్యాల మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జగిత్యాల జిల్లా చల్గల్ మ్యాంగో మార్కెట్ లో ఏటా వంద కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుంది. జగిత్యాల మామిడిని తెలంగాణ బ్రాండ్ నేమ్ తో మార్కెటింగ్ చేయాలని, దీంతో పాటు జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) వచ్చేలా చూడాలని అప్పటి ఎంపీ కవిత దృష్టికి రైతులు తీసుకెళ్లారు. స్పందించిన కవిత 2017 ఏప్రిల్లో జగిత్యాల మామిడి పేరు తో బ్రాండ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి లోగో విడుదల చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో దగా పడుతున్నారు.
సీజన్ స్టార్టింగ్ లో మామిడి రేటు పెంచడం, తర్వాత తగ్గించి కనీస ధర కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుండడంతో మామిడి రైతులు ఇతర పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే 40 వేల ఎకరాల నుంచి మామిడి సాగు 35 వేల ఎకరాలకు పడిపోయింది. ఇలాగే కొనసాగితే జగిత్యాల బ్రాండ్ ఏమో కానీ జగిత్యాల మామిడి కనుమరుగవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
2017 లో అప్పటి సబ్ కలెక్టర్ ప్రపోజల్స్..
దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని మామిడి రైతులు కనిపించిన లీడర్లను, ఆఫీసర్లను వేడుకునేవారు. సబ్ కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ జగిత్యాల మ్యాంగోకు బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసేలా మార్కెటింగ్ శాఖ చొరవ చూపితే రైతులు లాభాల బాట పడుతారని సర్కార్ కు ప్రపోజల్స్ పంపించారు. అప్పటి ఎంపీ కవిత రైతు సమావేశంలో జగిత్యాల బ్రాండ్ లోగోను గ్రాండ్గా ప్రారంభించారు. జగిత్యాల మ్యాంగో బ్రాండ్ నేమ్ తో ఢిల్లీ తెలంగాణ భవన్ లో మార్కెటింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే మార్కెటింగ్ శాఖతో పాటు మార్క్ ఫెడ్ తోనూ మామిడి మార్కెటింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో దళారుల బెడద పోతుందని, గిట్టుబాటు ధర లభించి రైతులకు లాభాలు వస్తాయని ఆశించారు. లోగో ఆవిష్కరించినప్పటికీ ఆఫీసర్లు మార్కెటింగ్ మాత్రం మరిచారు. కనీసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ వస్తే జాతీయ స్థాయి గుర్తింపుతో రైతుకు మేలు జరుగుతుందనుకుంటే హార్టికల్చర్ ఆఫీసర్ల ప్రపోజల్స్ మూడేళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయి.
డేంజర్ లో మామిడి సాగు..
వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో మామిడి కాయ తీవ్రంగా రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కేజీ మామిడి రూ. 30 గా ఉంటే రాలిన కాయ కేజీ రూ. 5 నుంచి రూ. 6 పలుకుతోంది. పంట బాగా పండితే ఎకరాకు సుమారు 3 టన్నులకు పైగా దిగుబడి వచ్చే చాన్స్ ఉంటుంది. ఈసారి అకాల వర్షాలు, తేనె మంచు పురుగుతో పూత సరిగ్గా లేకపోవడంతో ఎకరాకు 1.5 నుంచి 2 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. రైతులకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలానే కొనసాగితే జగిత్యాల లో మామిడి సాగు తీవ్రంగా తగ్గిపోయే పరిస్థితి ఉంది.
ప్రతీ రాష్ట్రం నుంచి వివిధ రకాల పండ్లను ఢిల్లీ లో తెచ్చి అమ్ముతుంటరు.. కానీ తెలంగాణ నుంచి గతంలో ఏ పండును కూడా మార్కెటింగ్ చేయలే.. ఆ ఆలోచన చేయలే.. జగిత్యాల మ్యాంగో లోగోతో తెలంగాణ పేరుతో బ్రాండ్ క్రియేట్ చేయాలే.. ఆ తర్వాత ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో మార్కెటింగ్ శాఖ ద్వారా జగిత్యాల మ్యాంగో ను అమ్మాలే'' జగిత్యాలలో 2017 ఏప్రిల్ 7న రైతు సమావేశంలో అప్పటి ఎంపీ కవిత
మామిడి రైతును మోసం చేసిన్రు..
జగిత్యాల మ్యాంగో పేరు తో బ్రాండ్ ఏర్పాటు చేస్తామని ఆరేండ్ల కింద అప్పటి ఎంపీ కవిత హామీ ఇచ్చి రైతులను మోసం చేశారు. ఇప్పటికీ సర్కార్ చర్యలు తీసుకోక పోవడంతో రైతులు దళారుల చేతుల్లో దగా పడుతున్నారు. బ్రాండ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తే రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నా చర్యలు
తీసుకోవడం లేదు. - పన్నాల తిరుపతి రెడ్డి, బీజేపీ లీడర్