
- చల్ గల్ మార్కెట్లో ఏటా వంద కోట్లకు పైగా బిజినెస్
- కార్బైడ్ వాడకంతో పడిపోతున్న క్వాలిటీ
- విదేశాలకు తగ్గుతున్న ఎగుమతులు
- ప్రాసెసింగ్ యూనిట్లతోనే చెక్ పెట్టే చాన్స్
జగిత్యాల, వెలుగు: దేశ, విదేశాల్లో జగిత్యాల మ్యాంగో బ్రాండ్ కు ఉన్న ఇమేజ్ దెబ్బతింటోంది. కమీషన్ ఏజెంట్లు మామిడిపండ్లను మాగబెట్టేందుకు కార్బైడ్‌ను వాడుతుండడంతో ఈ పరిస్థితి వస్తోంది. జగిత్యాల చల్ గల్ మ్యాంగో మార్కెట్ లో ఏటా వంద కోట్ల వ్యాపారం నడుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడి పండ్లను కమీషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మామిడిపండ్లు మాగబెట్టేందుకు నిషేధిత జాబితాలో ఉన్న కాల్షియం కార్బైడ్ ను వాడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండడంతో ఒకవైపు ప్రజలు ఆందోళన చెందుతుండగా, మరోవైపు ఎగుమతులపై ప్రభావం చూపుతోంది.
ఏటా వంద కోట్లకు పైగా బిజినెస్..
జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ మామిడి మార్కెట్ లో ఏటా వంద కోట్లకు పైగా మామిడి బిజినెస్ జరుగుతోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తారు. దీంతోపాటు పక్కనే ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాగయ్యే మామిడిని అమ్ముకునేందుకు జగిత్యాల మ్యాంగో మార్కెట్ కు తీసుకువస్తుంటారు. ఇక్కడి మామిడి రుచికరంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలతో పాటు పక్క దేశాలకు ఎగుమతి అవుతోంది.
కానీ, కొందరు దళారులు కాయలను పండించేందుకు నిషేధిత రసాయనాలు వాడుతున్నారు. దీంతో జగిత్యాల మామిడి అపఖ్యాతి మూటకట్టుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో దిగుమతి చేసుకున్న తరువాత క్వాలిటీ సరిగా లేదని తిప్పి పంపిస్తున్నారు. విదేశాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎయిర్ పోర్టుల్లో నిలిపి వేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో జగిత్యాల మ్యాంగో బ్రాండ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్ ఏజెంట్ల నిర్వాకంతో..
మామిడి పండ్లు మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. జగిత్యాల నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి సరఫరా చేయాలంటే రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఇతర రాష్ట్రాలకు చేరుకునేలోగా పండ్లు మాగేలా ప్లాన్ చేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ పాకెట్లను డబ్బాల్లో వేసి ప్యాకింగ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ రిప్ పౌడర్ కు ఆమోదం తెలిపింది. దీన్ని ఆగ్రోస్ సంస్థ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
అలాగే రైల్వే బొగ్గుతో కూడా సహజంగా మాగబెట్టే అవకాశం ఉంది. కానీ, తొందరగా మాగబెట్టి సొమ్ము చేసుకోవాలని కమీషన్ ఏజెంట్లు కార్బైడ్‌ను వాడుతున్నారు. వీటిని తింటే క్యాన్సర్, వివిధ రకాల అల్సర్స్, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెసింగ్ యూనిట్లతోనే అడ్డుకట్ట..
జగిత్యాల జిల్లాలో మామిడిసాగును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో ఎక్స్ పోర్ట్ జోన్ గా గుర్తించింది. ఎక్స్ పోర్ట్ జోన్ కార్యాచరణ మొదలుపెడితే రైతులకు లాభాలతో పాటు జగిత్యాల మామిడికి ఉన్న ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మామిడి కాయలను ప్రాసెనింగ్ చేసిన తరువాత ప్రభుత్వం అన్ని రకాల టెస్టులు చేసి పర్మిషన్ ఇస్తే ఇతర దేశాలకు ఎగుమతి చేసే వీలుంటుంది. అలాగే మార్కెట్ లో బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో రైతులకు మంచి ధరతో పాటు వ్యాపారులకు కలిసి వస్తుంది. మామిడి తోటల రైతులు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి ఎక్స్ పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని గిట్టుబాటు ధర పొందే అవకాశం కూడా ఉంటుంది. దీనికితోడు జగిత్యాల మ్యాంగోకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ వస్తే మార్కెట్ లో గుర్తింపు వచ్చి రైతులకు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.