
- సాగులో లేని భూములను గుర్తించే పనిలో ఆఫీసర్లు
- రెండేండ్ల కింద మాస్టర్ ప్లాన్ 2041 రూపకల్పన
- సాగుభూములు పోతున్నాయని రైతుల తిరుగుబాటుతో నాటి సర్కార్ వెనక్కి
జగిత్యాల, వెలుగు: జగిత్యాల బల్దియా మాస్టర్‌ప్లాన్‌పై కదలిక వచ్చింది. పట్టణాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలను మెప్పించేలా బల్దియా ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండేండ్ల కింద గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించగా.. సాగుభూములు కోల్పోతున్నామని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బల్దియా పాలకవర్గం తీర్మానం చేసి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేశారు. దీంతో 1989 లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌నే అమలు చేస్తున్నారు. తాజాగా బల్దియా ఆఫీసర్లు వ్యవసాయేతర భూములను గుర్తించే పనిలో పడ్డారు.
సాగు భూముల మినహాయింపు..?
గత సర్కార్ హయాంలో 2022 మార్చి 8న జగిత్యాల బల్దియా పాలకవర్గం మాస్టర్ ప్లాన్ 2041 కోసం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం అదే ఏడాది డిసెంబర్‌లో జీవో 238 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్లాన్‌లో నర్సింగాపూర్, మోతె, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హస్నాబాద్ గ్రామాల పరిధుల్లో సాగు భూముల్లో రిక్రియేషన్, పబ్లిక్-, సెమీ పబ్లిక్ , ఇండస్ట్రీయల్.. వంటి జోన్లు కేటాయించారు. దీంతో రైతులు నిరసనలకు దిగారు. ఆందోళనలు తీవ్రం కావడంతో మాస్టర్ ప్లాన్ 2041ను రద్దు చేశారు.
ఈ భూముల్లో కాకుండా ఇండ్రస్ట్రీయల్, రిక్రియేషన్ జోన్లుగా కేటాయిస్తే రైతులు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని బల్దియా ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ మేరకు సాగుభూములను మినహాయిస్తూ కొత్త మాస్టర్ ప్లాన్ పనిలో ఆఫీసర్లు ఉన్నారు.
ఇరుకు రోడ్లు.. కంపు డ్రైనేజీలు
జగిత్యాల బల్దియా పరిధిలో ఇప్పటికీ 1989లో రూపొందించిన మాస్టర్ ప్లానే అమలు అవుతోంది. జగిత్యాల జిల్లాకేంద్రంగా రూపాంతరం చెందాక.. పెరిగిన జనాభా, నివాసాలతో బల్దియాలో ఇరుకు రోడ్లు, కంపు కొట్టే డ్రైనేజీలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బల్దియా పరిధిలో 40 వేలకు పైగా ఇండ్లు, లక్షకు పైగా జనాభా ఉంది. బల్దియాలో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను విలీనం చేయాల్సి ఉండగా శివారు ప్రాంతాల్లోని సర్వే నంబర్లను మాత్రమే విలీనం చేశారు.
దీంతో ధరూర్, మోతె జీపీల్లో పర్మిషన్లు పొందుతూ డ్రైనేజీ వంటి అభివృద్ది పనులు బల్దియా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే పరిసర గ్రామాలను కాకుండా 2 కిలోమీటర్ల దూరంలో జీపీలను కలపడంతో మాస్టర్ ప్లాన్ ముక్కలుగా కనిపిస్తూ సర్వేల్లో ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. మాస్టర్ ప్లాన్ అమలైతే రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగ్, ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ల గుర్తింపు.. వంటి పనులతో జగిత్యాల అభివృద్ధి చెందే అవకాశం ఉంది.