రాజకీయ చిచ్చు పెట్టే కుట్రకు బండి సంజయ్ యత్నం: ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల జిల్లా : పోలీసుల అనుమతి లేనిదే బైంసా సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వెళ్లడానికి ప్రయత్నం చేశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. జగిత్యాల నియోజకవర్గంలో బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. అశాంతికి కారణమయ్యారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ చిచ్చు పెట్టే కుట్రకు తెరలేపారని అన్నారు. అల్లర్లు, గొడవలు చేయడం వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 

గతంలో బండి సంజయ్ చేసిన పాదయాత్రలకు, సభలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సున్నితమైన ప్రాంతం భైంసా కాబట్టి పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా బండి సంజయ్ సభకు అనుమతి నిరాకరించారని చెప్పారు. తన పర్యటనలో జరిగిన వివాదాలు, బండి సంజయ్ రెచ్చగొట్టే విధానాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరసారి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.