జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ సస్పెన్షన్

జగిత్యాల, వెలుగు : మైనార్టీ మహిళపై దాడి సంఘటనలో జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌‌‌‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ –-1 ఐజీ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల ఎస్పీ భాస్కర్ గురువారం తెలియజేశారు. ఈ నెల 9న జగిత్యాల బస్సు డిపో దగ్గర  ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్టు ఆధారంగా ఎస్సై ఎ.అనిల్​ను  సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మైనార్టీ మహిళపై దాడికి నిరసనగా బుధవారం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్‌‌‌‌పల్లి, జగిత్యాలల్లో ముస్లిం సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌‌‌‌ఐను ఎస్పీ ఆఫీస్​కు అటాచ్ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గురువారం డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసత్య ఆరోపణలు చేస్తున్నారు

వాళ్లే దాడి చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎస్సై అనిల్ భార్య సంధ్య ఆరోపించారు. తన బిడ్డకు పాలిచ్చే పరిస్థితి లేదని సీటు ఇవ్వాలని సదరు మహిళను తాను అభ్యర్థించానని, కండక్టర్ చెప్పినా వినకుండా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. జగిత్యాల బస్ స్టేషన్ కు రావాలని ఆమె కొంతమందికి ఫోన్లు చేయగా, భయం వేసి తన భర్త అనిల్‌‌‌‌కు చెప్పడంతో వచ్చారన్నారు. ఈ సందర్భంగా తనకు, సదరు మహిళకు గొడవ జరిగిందని, అంతేగాని తన భర్త ఎవరిపైనా దాడి చేయలేదన్నారు.