మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో మహిళను లాఠీతో కొట్టిన ఏఎస్సై, చేయి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఇద్దరినీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ఆవరణలో మళ్లీ గొడవకు దిగడంతో ఏఎస్సై ఆంజనేయులు లాఠీతో కొట్టగా, హెడ్ కానిస్టేబుల్ అశోక్ చేయి చేసుకున్నారు. దీన్ని బయటి నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలయ్యింది.
ఘటనపై ఎస్పీ అశోక్ కుమార్ స్పందించి విచారణకు ఆదేశించారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడంతో ఏఎస్సై ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ అశోక్‌ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. ఘటనను మానవహక్కుల సంఘం, మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. ఈ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతున్నారన్న ఆరోపణలున్నాయి.