- ట్రీట్‌మెంట్‌లో వాడాల్సిన డ్రగ్స్ హైదరాబాద్‌కు సప్లై
- ఇటీవల జగిత్యాలలో భారీగా డ్రగ్స్ పట్టివేత
- జగిత్యాల ఈఎన్‌టీ డాక్టర్ అరెస్ట్‌తో కలకలం
- అనుమానిత డాక్టర్ల మెడికల్ ఇండెంట్ వివరాలపై ఆరా
జగిత్యాల, వెలుగు : వైద్య చికిత్సలో వినియోగించాల్సిన డ్రగ్స్‌ను కొందరు డాక్టర్లు అడ్డదారిలో అమ్ముకుంటున్నారు. అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మోతాదులో తెప్పించి పక్కదారి పట్టిస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ ధరకు దొరికే ఈ తరహా డ్రగ్స్ తీసుకుంటున్న యువత ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటోంది. ఇలాంటి డ్రగ్స్ దందాకు జగిత్యాల కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల జరిగిన దాడుల్లో జగిత్యాలకు చెందిన ఓ ఈఎన్‌టీ డాక్టర్ పట్టుబడడం, ఆఫీసర్ల లిస్ట్‌లో మరికొందరు డాక్టర్లు ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
జగిత్యాల టు హైదరాబాద్
కొందరు డాక్టర్లు రూల్స్‌కు విరుద్ధంగా డ్రగ్ వాయిల్స్ జమ చేస్తూ వేలాది రూపాయలకు డ్రగ్ అడిక్టర్స్‌కు అమ్ముతున్నారు. ఈ రకమైన చర్యలకు పాల్పడిన జగిత్యాల మానస ఈఎన్‌టీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ జి.మదన్‌మోహన్‌ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎంక్వైరీ స్టార్ట్ చేయగా జగిత్యాల జిల్లాలో నార్కోటిక్ డ్రగ్స్ అమ్మేందుకు లైసెన్స్ ఉన్న ఏకైక మెడికల్ షాప్ మదన్‌మోహన్‌దే అని గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన నార్కోటిక్ ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లైసెన్స్ కలిగి ఉన్న ఫార్మసీల్లో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అనుమానిత డాక్టర్ల మెడికల్ ఇండెంట్ వివరాలు సైతం సేకరిస్తున్నారు.
సర్జరీ మాటున వాయిల్స్ జమ
సాధారణంగా ఆపరేషన్లలో నార్మల్ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అని రెండు రకాల మందులు వినియోగిస్తుంటారు. సర్జరీకి ముందు పేషెంట్ ఇమ్యూనిటీ పవర్‌కు అనుగుణంగా అనస్థీషియా డాక్టర్ మత్తు ఇంజక్షన్ ఇస్తారు. ఇందులో ఒక్కో పేషెంట్‌కు ఒక్కో మోతాదులో ఇస్తుంటారు. సర్జరీ అవసరమైన పేషెంట్‌కు సాధారణంగా తమ ఫార్మసీల్లో లభించే మత్తు ఇంజక్షన్లనే అనస్థీషియా డాక్టర్స్ వినియోగిస్తుంటారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ మందు సైతం పనిచేయనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లోనే నార్కోటిక్ డ్రగ్స్ తెప్పించి వాడుతారు.
దీన్ని అవకాశంగా మలుచుకున్న డాక్టర్లు ఓ వ్యక్తికి సర్జరీ చేసే ముందు ఐదు వాయిల్స్ నార్కోటిక్ డ్రగ్‌ను తెప్పిస్తున్నారు. పేషెంట్‌కు ఒకటి, రెండు వాయిల్స్ మందు మాత్రమే సరిపోతుంది. మిగిలిన వాయిల్స్‌ను ఫార్మసీకి వాపస్ చేయకుండా కొందరు డాక్టర్లు తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఇలా మిగిలిన వాయిల్స్‌ను జమ చేసి బయటి వ్యక్తులకు ప్రిస్క్రిప్షన్ లేకుండానే వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఫార్మసీలో రూ. 30 నుంచి రూ. 40 కి దొరికే ఒక్కో వాయిల్‌ను బ్లాక్‌లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అమ్ముతున్నారు.
నార్కోటిక్ డ్రగ్స్‌కు బానిసలవుతున్న యువత
మద్యం, మత్తుకు బానిస అయిన యువత మరింత మత్తు కోసం నార్కోటిక్ డ్రగ్స్ సల్ఫేట్, మార్పిన్ సల్ఫేట్, బుప్రెజెసిక్, డయజోఫామ్, రూమార్ప్, లిబ్రాక్స్, పెంటాజోసిస్, మెజోలం, నాలోక్సన్, వెర్మోర్ వంటి డ్రగ్స్ వాడుతున్నారు. ఈ మందులు విచ్చలవిడిగా దొరుకుతుండడంతో యువత బానిసలుగా మారుతున్నారు. ఫార్మసీల్లో క్రమం తప్పకుండా ఆఫీసర్లు తనిఖీలు చేయడంతో పాటు, మత్తు మందులు అమ్మే టైం ప్రిస్క్రిప్షన్ కాపీని తప్పనిసరిగా భద్రపరచాలన్న నిబంధనలను అమలు చేస్తే కొంతవరకైనా అడ్డుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మిస్ యూజ్ చేయొద్దు
అనస్థీషియా డాక్టర్లు నార్కోటిక్ డ్రగ్స్‌ను మిస్ యూజ్ చేయొద్దు. ఎక్కడైనా మిస్ యూజ్ చేసినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవు.
- ఉపేందర్, డ్రగ్ ఇన్స్‌పెక్టర్, జగిత్యాల