
కేవలం సర్కార్ ఆఫీసుల వద్ద పనులు
488 ఆస్తులను గుర్తించిన బల్దియా ఆఫీసర్లు
రూ. 75 కోట్ల నష్ట పరిహారం చెల్లింపునకు అంచనాలు
ఆ తర్వాత పరిహారానికి బదులు టీడీఆర్
జగిత్యాల, వెలుగు: జగిత్యాలలో యావర్ రోడ్డు వెడల్పు కలగానే మిగులుతోంది. 30 ఏండ్లుగా ఈ పని హామీగానే మిగులుతోంది. గత సర్కార్ హయాంలో ప్రభుత్వ స్థలాల వద్ద వెడల్పు చేసి ఆ తర్వాత పట్టించుకోలేదు. రోడ్డుకిరువైపులా నష్టపోతున్న బాధితుల వివరాలు సేకరించింది. వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారం విలువ దాదాపు రూ. 75 కోట్లుగా ఆఫీసర్లు అంచనా వేశారు. పదేళ్లలో రోడ్డు వెడల్పు అంశాన్ని సర్వేల పేరుతో నాన్చుతూ వచ్చింది. దాదాపు 5 సార్లు సర్వే చేపట్టి మార్కింగ్ చేశారు. రోడ్డు వెడల్పులో నష్టపోతున్న బాధితులకు పరిహారం ఇస్తామని చెప్పి.. నాటి సర్కార్ టీడీఆర్‌ను తెర మీదకు తీసుకువచ్చింది. కానీ బాధితులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో దశాబ్దాలుగా ఇరుకు రోడ్డు సమస్య తీరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
100 ఫీట్లకు పెంచాలని ప్రతిపాదనలు..
జగిత్యాల జిల్లా కేంద్రం జిల్లాకేంద్రంగా మారాక పట్టణంలో ట్రాఫిక్ పెరిగింది. ముఖ్యంగా యావర్ రోడ్డు (కరీంనగర్– ధర్మపురి) ఇరుగ్గా ఉండడంతో దశాబ్దాలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 40, 60, 80 ఫీట్లుగా ఉన్న ఈ రోడ్డుపై ట్రాఫిక్ తో పాటు యాక్సిడెంట్లు కూడా పెరిగాయి. యావర్ రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రభుత్వ ఆఫీసులు వద్ద రోడ్డు వెడల్పు చేసి చేతులు దులుపుకున్నారు. యావర్ రోడ్డు వెడల్పులో కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దాదాపు 488 పైగా ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.
ఇందులో కుడి వైపు 255 బిల్డింగ్స్, ఎడమ వైపు 233 బిల్డింగ్స్ కూల్చాలని తేల్చారు. ఈ మేరకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం.. దాదాపు రూ. 75 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. గత సర్కార్‌లో ఫండ్స్ లేవంటూ టీడీఆర్ తెరమీదకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి 2023 సెప్టెంబర్‌లో సర్వే చేపట్టారు. బాధితులు సుమారు 20 గజాల స్థలం కోల్పోతే వారికి 60 నుంచి 80 గజాల టీడీఆర్(ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) జారీ చేసేలా జీవో కూడా తీసుకువచ్చారు. ఈ బాండ్‌ను యజమాని ఎవరికైనా అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించినప్పటికి బాధితులు ఆసక్తి
చూపలేదు.
నివేదిక అందజేశాం
యావర్ రోడ్డులో కుడి వైపు 255 బిల్డింగ్స్, ఎడమ వైపు 233 బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నట్లు గుర్తించాం. ఈ ప్రాపర్టీలకు దాదాపు రూ. 75 కోట్ల వరకు నష్ట పరిహారం చెల్సించాల్సి ఉంది. రోడ్డు వెడల్పుకు సంబంధించిన నివేదికను సర్కార్‌కు అందించాం. సర్కార్ ఆదేశాల మేరకు పనులు చేపడుతాం. - శ్రీనివాస్, జగిత్యాల బల్దియా టీపీవో