కోరుట్ల/మెట్‌పల్లి, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాల పనులను గడువులోగా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో పర్యటించారు. తొలుత కోరుట్ల పట్టణంలోని పట్టణంలోని కాగజ్‌పురా ఉర్దూ మీడియం ఉన్నత, ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. స్కూల్‌లో నడుస్తున్న పనులను పరిశీలించారు. స్కూల్‌లో కరెంట్, తాగునీరు, ఇతర రిపేర్లను వెంటనే పూర్తిచేయాలన్నారు. ప్రతి విద్యార్థిపై టీచర్లు ఫోకస్ చేయాలన్నారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలన్నారు.
అనంతరం పాతబస్టాండ్ ఏరియాలోని ఫర్టిలైజర్స్ షాపును తనిఖీ చేశారు. రైతులకు అమ్మిన ఎరువులు, విత్తనాలకు రసీదు ఇవ్వాలన్నారు. ఇబ్రహీంపట్నం మండలపరిషత్ ఆఫీస్‌తోపాటు మెట్‌పల్లిలో ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేశారు. గృహజ్యోతి స్కీంకు వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. అధికారులు సమయపాలన పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో రఘువరన్, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీఏవో వాణి, ఆర్డీవోలు ఆనంద్ కుమార్, ఎన్.శ్రీనివాస్, తహసీల్దార్ కిషన్, ఏవోలు షహీద్‌అలీ, నాగమణి, ఎంఈవో నరేశం ఉన్నారు.