
మెట్‌పల్లి, వెలుగు: ట్యాక్సులు చెల్లించకపోతే షాపింగ్ మాల్స్‌ను సీజ్ చేస్తామని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం మెట్‌పల్లి, రాయికల్, జగిత్యాల పట్టణాల్లో ఆస్తి పన్ను, ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో సకాలంలో ట్యాక్సులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మెట్‌పల్లి, జగిత్యాల బల్దియాల్లోని షాపింగ్ మాల్స్ భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, రెండు రోజుల్లో కట్టకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఈనెల 31 లోపు 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని గడువు లోపల ప్రజలందరూ ఇంటి పన్నులు చెల్లించాలన్నారు. వార్డు ఆఫీసర్లు ప్రతి ఒక్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు, ఇంటి పన్ను బకాయిదారునికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. 100 శాతం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లను ఆదేశించారు.