సీఎం కేసీఆర్, కవిత కలిసి ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేశారని జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. 2018లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తే.. కౌంటింగ్ లో 441 ఓట్లతో ఓడిపోయినట్లు ప్రకటించారని తెలిపారు. అప్పటివరకు తాను లీడ్ లో ఉండగా.. చివరి రౌండ్ లో కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించారన్నారు. చివరి రౌండ్ లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య ఒక్క శాతం తేడా వచ్చిందని చెప్పారు.
పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్లగా.. కరోనా కారణంగా కేసు ఆలస్యమవుతూ వచ్చిందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లగా..తన పిటిషన్ ను సమర్ధిస్తూ కొప్పుల పిటిషన్లను కొట్టేశాయని చెప్పారు. ప్రజాతీర్పుపై గౌరవముంటే కొప్పుల రీ కౌంటింగ్ కు సిద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ తన మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటన్నారు. కొప్పుల ఈశ్వర్ కోర్టు ఖర్చులు భరించే వాళ్లంతా కేసీఆర్ బంధువులేనని ఆరోపించారు. కొప్పుల ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రకటించారు.