- కొద్ది రోజులుగా బాధితుడిని సతాయిస్తున్న వడ్లు కొన్న వ్యక్తి
- మనస్తాపంతో ఆయన ఇంటి వద్ద పురుగుల మందు తాగిన బాధితుడు
- హాస్పిటల్ లో వ్యాపారి కోసం భార్య, ప్రియురాలు గొడవ
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన
మెట్ పల్లి, వెలుగు : రైతుల నుంచి కొన్న వడ్లను మరో వ్యాపారికి అమ్మగా వాటి డబ్బులు రాలేదని మనస్తాపంతో వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ట్రీట్మెంట్ కోసం ఆయనను హాస్పిటల్ తీసుకెళ్తుండగా అతని భార్య, ప్రియురాలు కొట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని ఒకటో వార్డు రేగుంటకు చెందిన సిరున్నం తిరుపతి (45) పలువురు రైతుల నుంచి ఇటీవలే వడ్లు కొన్నాడు. ఆ వడ్లను మెట్ పల్లి మండలం రాజేశ్వర్ రావు పేటకు చెందిన ఓ వ్యాపారికి అమ్మాడు.
వడ్లు కొనుగోలు చేసిన ఆ వ్యాపారి పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా తిరుపతిని సతాయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిరుపతికి వడ్లు అమ్మిన రైతులు డబ్బులు తొందరగా ఇవ్వాలని ఆయనను ఒత్తిడి చేశారు. ‘‘నా వద్ద డబ్బులు లేవు. నేను వడ్లు అమ్మిన వ్యాపారి నుంచి రూ.30 లక్షలకు పైగా రావాల్సి ఉంది. అవి రాగానే ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తా” అని రైతులను తిరుపతి సముదాయించాడు. ఈ క్రమంలో తిరుపతి గురువారం పురుగుమల మందు తీసుకొని రాజేశ్వరరావు పేటలో వ్యాపారి ఇంటికి వెళ్లాడు. వడ్ల డబ్బుల వెంటనే ఇవ్వాలని కోరాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సదరు వ్యాపారి తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో తిరుపతి మనస్తాపం చెందాడు. బయటకు వెళ్లిన తిరుపతి.. అప్పటికే తన వద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న స్థానికులు బాధితుడిని మెట్ పల్లి సివిల్ హాస్పిటల్ కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న తిరుపతిని చూసేందుకు ఆయన భార్య, ప్రియురాలు వచ్చారు. తిరుపతి వద్ద నేనే ఉండి సేవ చేస్తానని ప్రియురాలు.. కాదు నేనే ఉంటానని భార్య గొడవపడ్డారు. ఈ క్రమంలో బాధితుడి ఆరోగ్యం విషమించింది.
మెరుగైన వైద్యం కోసం బాధితుడిని జగిత్యాలకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. తిరుపతిని జగిత్యాలకు తీసుకెళ్లేటపుడు భార్య, ప్రియురాలు అంబులెన్స్ లో ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కూడా ఇద్దరూ గొడవపడ్డారు. కోపోద్రిక్తులైన తిరుపతి భార్య, కుటుంబ సభ్యులు ప్రియురాలిపై దాడి చేసి అంబులెన్స్ నుంచి కిందికి దించేశారు. అనంతరం ఇద్దరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది ఇద్దరిని సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.