- మూడేండ్ల కింద జగిత్యాలను ఎక్స్‌పోర్ట్ జోన్‌గా గుర్తించిన కేంద్రం
- బ్రాండింగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ హామీని మరిచిన గత సర్కార్
- కార్యాచరణ లేకపోవడంతో ఏర్పాటు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు
- ఎప్పట్లాగే రైతులకు కష్టాలు
జగిత్యాల, వెలుగు : మూడేండ్ల కింద జగిత్యాల జిల్లాను మామిడి ఎక్స్‌పోర్ట్ జోన్‌గా గుర్తించింది. అయితే గత సర్కార్ నిర్లక్ష్యంతో మామిడి ఎక్స్‌పోర్ట్ జోన్ అటేపోయింది. బ్రాండింగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ హామీలను కూడా మరిచిపోయింది. ఎక్స్‌పోర్ట్ జోన్‌లో భాగంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కావాల్సి ఉండగా ఆ వైపుగా కార్యాచరణ కొరవడింది. దీంతో ఏటా జిల్లా రైతులకు మామిడి కష్టాలు తప్పడం లేదు.
ఏటా రూ.100 కోట్లకు పైగా మామిడి బిజినెస్
జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ మామిడి మార్కెట్‌లో ఏటా రూ.100 కోట్లకుపైగా బిజినెస్ జరుగుతుంది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో మామిడి సాగుచేస్తారు. ఎకరానికి 10 టన్నుల చొప్పున సుమారు 3 నుంచి 4 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. దీంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ మార్కెట్‌కు మామిడిని తీసుకొస్తారు. ఎంతో రుచికరంగా ఉండే జగిత్యాల మామిడి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఇక్కడి రైతులకు ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతోపాటు దళారుల కారణంగా గిట్టుబాటు ధర అందడం లేదు. దళారులంతా ఏకమై క్వాలిటీ పేరుతో ధర అమాంతం తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
హామీలు మరిచిన బీఆర్ఎస్ సర్కార్
జగిత్యాల మామిడికి బ్రాండింగ్‌తోపాటు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇస్తే నేరుగా రైతులకు లాభాలు వచ్చే అవకాశముందనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి ఎంపీ కవిత జగిత్యాల మ్యాంగో లోగో ఆవిష్కరించి, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా బ్రాండింగ్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జగిత్యాల మామిడి ప్రత్యేక గుర్తింపు పొందేలా జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడిచినా ఇది హామీగానే మిగిలిపోయింది.
ప్రొసెసింగ్ యూనిట్లతో దళారులకు చెక్:
జిల్లాలో మామిడి సాగు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2022 లో ఎక్స్ పోర్ట్ జోన్‌గా గుర్తించింది. ఈ మేరకు ఎక్స్ పోర్ట్ జోన్ కార్యాచరణ మొదలు పెడితే రైతులకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా సీజన్ లో వ్యాపారులు రైతుల నుంచి నేరుగా మామిడిని కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ చేసి నేరుగా ప్రభుత్వం అన్ని రకాల టెస్టులు చేసి పర్మిషన్ ఇవ్వడంతో ఇతర దేశాలకు ఎగుమతి చేసే వీలుంటుంది. ఫలితంగా రైతులకు మంచి ధరతో పాటు వ్యాపారులకూ కలిసి వస్తుంది. అలాగే మామిడి తోటల రైతులు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి దాని ద్వారా ఎక్స్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని గిట్టుబాటు ధర పొందే అవకాశం కూడా ఉంటుంది.
ఎలాంటి జీవో రాలేదు
కేంద్ర ప్రభుత్వం 2022లో జగిత్యాల జిల్లాను ఎక్స్ పోర్ట్ జోన్ గా గుర్తించింది. ఇప్పటికి ఎక్స్ పోర్ట్ జోన్ కార్యాచరణపై ఎలాంటి జీవో రాలేదు. రైతులకు మామిడి సాగుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.
హర్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, జగిత్యాల