జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టిలకు తరలిస్తూ.. కోట్ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ధర్మపురిలోని అక్కపల్లి చెరువు, గొల్లపల్లి చిల్వకొడూరు, ధర్మారం మండలం రచ్చపల్లి, రామయ్యపల్లి చెరువులో నుంచి కోట్లు రూపాయల విలువగల మట్టిని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని ఎత్తుకెళ్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే రీతిలో మట్టి మాఫియా కొనసాగిందని స్థానికులు వాపోతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో జేసీబీలు, వందల సంఖ్యల్లో లారీలు, టిప్పర్లతో మట్టిని భారీగా ఎత్తుకెలుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని అంటున్నారు. రచ్చపల్లి, రామయ్యపల్లి గ్రామ పంచాయతీలకు మట్టి మాఫియా రూ. 30 లక్షలు ఇచ్చినట్లు సమాచారం.