బీఆర్ఎస్ పార్టీకి భోగ శ్రావణి రాజీనామా

జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వార్డ్ కౌన్సిలర్ కు రాజీనామా చేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తూ.. రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపినట్లు తెలిపారు. అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్సీ కవిత ఆశీర్వాదంతోనే తాను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానని భోగ శ్రావణి చెప్పారు. తనకు ఇన్ని రోజులు సహకరించిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ కు శ్రావణి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ స్వార్ధపూరిత కుట్రలకు బీసీ మహిళ బలైందని.. అందుకే ఆత్మాభిమానం కోసమే మున్సిపల్ పదవికి రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత అనుచరులను పార్టీకి దూరం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని ఆరోపించారు. పార్టీ నుండి తనకు ఎలాంటి సహకారం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ప్రజల ఓట్లతో గెలిచానే తప్ప ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే గెలవలేదని వ్యాఖ్యానించారు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజాల పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. అన్ని పార్టీలు తనను ఆహ్వానించాయి..కానీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని శ్రావణి స్పష్టం చేశారు.