జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై నిరసనల వెల్లువ

జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై నిరసనల వెల్లువ

జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మరో గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జగిత్యాల అర్బన్ మండలం థరూర్ గ్రామ పాలకవర్గం ఇవాళ సమావేశమైంది. మాస్టర్ ప్లాన్ లో తమ గ్రామాన్ని కమర్షియల్ జోన్ కింద చేర్చడం పట్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తీర్మానం చేసిన పాలకవర్గ సభ్యులు.. ర్యాలీగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ అధికారులకు తీర్మాన పత్రాన్ని అందించారు.

మరోవైపు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ.. అంబారిపేట్ గ్రామస్తులు గ్రామసభ నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై సభలో చర్చించారు.ఈ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మాస్టర్ ఫ్లాన్ ముసాయిదా వెంటనే రద్దు చేయాలని మహిళా రైతులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి తమకు రద్దు తీర్మానం ఇచ్చే వరకూ పోరాటం చేస్తామంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, నూతన మాస్టర్‌ ప్లాన్‌లో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలతో పాటు వ్యవసాయ భూములను కలుపుతూ అధికారులు పబ్లిక్‌ జోన్‌, సెమీ పబ్లిక్‌ జోన్‌లుగా ముసాయిదా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు.