ఆపరేషన్​కు ముందే కడుపులో కర్చీఫ్​ ఉండొచ్చు..!

జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఆసుపత్రిలో మూడో కాన్పు చేసుకున్న నవ్య శ్రీకి గతంలోనే రెండు కాన్పులు జరిగాయని,  ఆ కాన్పుల్లో కర్చీప్​ మరిచి ఉండొచ్చని జగిత్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్​ రాములు అన్నారు. ఈ ఘటనపై జగిత్యాల కలెక్టర్ యాస్మిన్​ భాషా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్​రాములు, డీఎంహెచ్​వో శ్రీధర్, గైనకాలజీ హెచ్ వోడీ అరుణలతో త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశారు.  

బుధవారం కమిటీ సభ్యుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు​ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పది రోజుల క్రితం వేములవాడలో ఆపరేషన్​ చేసిన ఆస్పత్రికి వెళ్లి అక్కడి డాక్టర్ల నుంచి వివరాలు సేకరించామన్నారు.  బాధితురాలు నవ్యశ్రీ కడుపు లో నుంచి తీసిన మాప్ సైజు 10/10గా  ఉందని, జగిత్యాల ఆసుపత్రి లో 6/6 మాప్ వాడుతున్నట్లు తెలిపారు.  నవ్య శ్రీకి సర్జరీ చేసిన డాక్టర్ల తో పాటు డ్యూటీ లో ఉన్న స్టాఫ్ నర్స్ ను ఇతర సిబ్బందిని విచారించామన్నారు. వారు ఆపరేషన్ సక్రమంగా చేసినట్లు లిఖిత పూర్వకంగా రాసిచ్చినట్లు మీడియాకు తెలిపారు.  మూడో కాన్పు లో మాప్ (కర్చీఫ్) మరిచినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

వివాదాస్పదంగా మారిన త్రీమెన్ కమిటీ స్టేట్​మెంట్ 

నవ్యశ్రీకి గతంలో జరిగిన రెండు కాన్పుల్లో మాప్ (కర్చీప్​) మర్చిపోయే అవకాశం ఉందని త్రీమెన్ కమిటీ సభ్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్​ రాములు చెప్పడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా గర్భం దాల్చిన సమయం నుంచి  డెలివరీ అయ్యే వరకు సుమారు 4 నుంచి 6 సార్లు టిఫా, అల్ట్రా స్కాన్, సిటి స్కాన్ లాంటివి చేస్తుంటారు. వీటిలో కర్చీప్​ ఉన్నట్లు  బయట పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  ఇలాంటి ఘటన లు జరిగిన సమయంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల తో పాటు ఇతర సంబంధిత శాఖలకు చెందిన ఆఫీసర్లను కమిటీ లో చేర్చితే న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.