సాయం చేయబోయి జైలు పాలైన జగిత్యాల వ్యక్తి...

ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... స్వదేశం తిరిగి వస్తూ సాయం చేయబోయి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..  జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం పొలాస గ్రామానికి చెందిన బద్దెనపల్లి శంకరయ్య అనే వ్యక్తి సౌదీ నుంచి గత నెల 12న కొలంబో విమానంలో స్వదేశానికి బయలు దేరాడు... విమానంలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ శ్రీలంక మహిళ కూడా ప్రయాణం చేసింది. ఆ చిన్నారికి శంకరయ్య దుప్పటి కప్పే ప్రయత్నం చేస్తుండగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విమాన సిబ్బందికి  ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. 

ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా జమానత్ ఇచ్చేవారు లేకపోవడంతో..  కేసు ముగిసే వరకు శ్రీలంకలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీలంకలో చిక్కుకున్న శంకరయ్యను జైలు విడిపించి స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం సాయం అందించాలని ఆయన భార్య గంగలక్ష్మి, కుమారుడు గంగమల్లు, కూతురు శ్రీలక్ష్మీ విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.