జగిత్యాల, వెలుగు : ‘ఏమనుకుంటున్నవ్. ట్రీట్మెంట్ చేస్తలేమని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తవా? అయితే ఆయనతోనే చేయించుకో’ అంటూ అత్యవసర పరిస్థితిలో వైద్యం అవసరమైన ఓ గర్భిణి బంధువుతో నిర్లక్ష్యంగా మాట్లాడిందో ఎంసీహెచ్ నర్సు. డాక్టర్ కూడా లేకపోవడంతో బాధితురాలిని వెంటనే ప్రైవేట్ దవాఖానాకు తరలించారు. దీంతో తల్లీ, బిడ్డ ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పెర్ఫీ డెలివరీ కోసం ఈ నెల 18న జగిత్యాల ఎంసీహెచ్‌లో( మాతా శిశు సంరక్షరణ కేంద్రం) లో చేరింది. మొదటి కాన్పు కావడంతో నార్మల్ డెలివరీ చేయాలని డాక్టర్లు, సిబ్బంది వేచి చూశారు. సోమవారం రాత్రి11:30 గంటలకు నొప్పులు రావడం, ఉమ్మనీరంతా పోవడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు.
డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఏదో ఒకటి చేసి కాపాడాలని అక్కడున్న నర్సును బతిమిలాడారు. ‘మాకు అన్నీ తెలుసు..మీరు చెప్తేనే చేస్తమా?’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడింది. దీంతో స్థానిక లీడర్ల సాయంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారు. ఎమ్మెల్యే సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి తక్షణ వైద్య సాయం అందించాలని కోరారు. ఆయన దవాఖానాలో సిబ్బందికి ఫోన్ చేసి వెంటనే ట్రీట్మెంట్ చేయాలని ఆదేశించారు. దీనికి కోపం పెంచుకున్న అక్కడి నర్సు ‘ఎమ్మెల్యే తో ఫోన్ చేయిస్తారా? అయితే ఏంది? ఆయనతోనే ట్రీట్మెంట్ చేయించుకో’ అంటూ విసురుగా సమాధానమిచ్చారు. అదంతా పట్టించుకోవద్దని, ముందు వైద్యం చేయాలని కాళ్లు మొక్కినా వినలేదు. ఆమె ప్రాణం పోయే పరిస్థితి ఉండడంతో వెంటనే ఓ ప్రైవేట్ దవాఖానాకు తరలించారు. అక్కడ సిజేరియన్చేయడంతో తల్లి, బిడ్డల ప్రాణాలు దక్కాయి.
నాలుగు రోజుల క్రితం కూడా..
జగిత్యాల ఎంసీహెచ్‌లో ఈ నెల 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బుగ్గారం మండలం చిన్నాపూర్ కు చెందిన గర్భిణి శైలజ 14వ తేదీన ఎంసీహెచ్‌లో చేరింది. డాక్టర్లు చిన్న ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుట్లు వేసి మరుసటి రోజు డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో 17న మళ్లీ ఎంసీహెచ్‌కు తీసుకువచ్చారు. స్కానింగ్ చేయడంతో కుట్లు వేసేప్పుడు కాటన్ మర్చిపోవడంతోనే కడుపునొప్పి వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యిందని గుర్తించారు. వెంటనే కుట్లు విప్పి కాటన్ తొలగించారు.
ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించిన ఆమె భర్తపైనే డాక్టర్ ఫైర్ అయ్యాడు. ఈ విషయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని, దవాఖానా సిబ్బంది తీరుపై సమీక్ష చేస్తానని చెప్పారు. ఈ ఘటనలో నర్సు, ఆయాను బలి పశువును చేయాలని చూడగా.. అసలు బాధ్యులు వేరే ఉన్నారని, వారిపైనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త పట్టుబట్టాడు. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.