రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుల నిరసనలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని.. రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సరైనది కాదన్నారు. కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఎన్నోసార్లు పోరాటం చేశారని చెప్పారు.
ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసినట్లు సంజయ్ తెలిపారు. గతంలో 69 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ప్రస్తుతం 2లక్షల 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వమని, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ ను కొందరు నాయకులు కావాలని బద్నాం చేస్తున్నారని విమర్శించారు.