జగిత్యాల: ప్రభుత్వ నిషేధిత చైనా మాంజా ను ఉపయోగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చిరించారు. సంక్రాంతి పండుగకు గాలి పటాలతో పాటు పక్షులను ఎగరనిద్దామని చైనా మాంజాతో తలెత్తే అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అన్నారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే గాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని చెప్పారు.
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని.. ఈ చైనా మాంజాను నిల్వచేసినా.. రవాణా చేసినా.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చైనా మాంజా ను ఎవరైనా తయారు చేసిన లేదా, అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే.. సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గానీ.. డయల్ 100 గానీ ఫోన్ చేసి తెలపాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.