- ట్రావెల్ బ్యాన్‌కు గురైన జగిత్యాల వాసి
- ఆందోళనలో కుటుంబసభ్యులు
జగిత్యాల టౌన్, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వస్తే ఓ ముఠా తనను మోసం చేసిందని జగిత్యాల వాసి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో ప్రకారం...జగిత్యాలకు చెందిన గొల్లపెల్లి రాజేశ్ (39) ఆరు నెలల కింద దుబాయ్ వెళ్లాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అతడికి ఓ ముఠా జాబ్ ఇప్పిస్తామని నమ్మించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఈలోగా ఇండియాకు వెళ్లి రావాలని వారు చెప్పడంతో స్వదేశానికి బయలుదేరగా అబుదాబి విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రమేయం లేకుండా లోన్లు తీశారని, దాంతో ట్రావెల్ బ్యాన్ కు గురయ్యానని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తనను ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలని కోరాడు.
ఆత్మహత్యే శరణ్యం
దుబాయిలో బ్యాంకు మోసాల ముఠా ఉచ్చు లో చిక్కిన తన భర్తను రక్షించాలని రాజేశ్ భార్యతో పాటు తల్లి కోరుతున్నారు. తిండి తినడానికి కూడా డబ్బులు లేవని, ప్రభుత్వం స్పందించి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. లేకపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నారు. కాగా, ఈ విషయాన్ని ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎంవో దృష్టికి తీసుకువెళ్లారు. సీఎస్ ద్వారా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఈనెల 18న వైర్ లెస్ మెసేజ్ పంపించారు.