విదేశాల్లో జాబ్ ,మంచి జీతం అని ఎవరైనా చెబితే నమ్మకండి..అడ్డంగా బుక్కవుతారు. నమ్మి పోతే నట్టేట ముంచుతున్నారు. ఏజెంట్లు ఇక్కడ చెప్పేది ఒక్కటైతే..అక్కడికి తీసుకెళ్లి మనోళ్ల చేత చేయించే పనులు ఇంకోటి. ఈ మధ్య నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని..వాళ్లతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. పాస్ పోర్ట్, వీసా లాక్కొని సోషల్ మీడియాలో నేరాలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాకు చెందిన యువకులకు జరిగింది.
లావోస్ లో జాబ్ కోసం వెళ్లి మోసపోయామంటూ జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్ వంశీ అనే వ్యక్తి తమను మోసం చేశాడు. ఏజెంట్ కు ఒక్కొక్కరు సుమారు రూ.2 లక్షలు ఇచ్చి లావోస్ కు వెళ్లాం. చైనాకు చెందిన మధ్యవర్తికి నగదు అప్పగించాం . పనితీరును బట్టి వేతనం పెరుగుతుందని ఏజెంట్ వంశీ చెప్పాడు. లావోస్ కు వెళ్లాక సైబర్ మోసాలు చేయడానికి తమను వాడుకోవడానికి ప్రయత్నించారు.
ALSO READ | వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ : మంత్రి కిషన్ రెడ్డి
ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ద్వారా మోసం చేసేందుకు శిక్షణ ఇచ్చారు. భోజనం కూడా లేక మూడు, నాలుగు రోజులు పస్తులు ఉన్నాం . ఎట్టకేలకు ఆంధ్రాకు చెందిన వ్యక్తి సహాయంతో అక్టోబర్ 7న హైదరాబాద్ చేరుకున్నాం. లావోస్ పంపిన ఏజెంట్ ను నిలదీస్తే నేనేం చెయ్యాలని, డబ్బులు ఇవ్వనని మొండికేస్తున్నాడు. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.