డిగ్రీ అర్హతతో విడుదలైన నోటిఫికేషన్లు, ఇంజినీరింగ్ అర్హతతో విడుదలైన నోటిఫికేషన్లు.. వేటిని వదలకుండా చదివి వీఆర్‌వో, గ్రూప్–4, జూనియర్ పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్, వర్క్ ఇన్స్‌పెక్టర్ ఇలా వరుసగా ఆరు జాబులు కొట్టాడు గడ్డమీది భార్గవ్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన భార్గవ్ ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్‌లో చేరాడు. ఫైనల్ ఇయర్‌లో ఉండగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌వో) నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేద్దామంటే బీటెక్ అయితే నడవదు డిగ్రీ ఉండాలన్నారు. వెంటనే ఓపెన్‌లో డిగ్రీ చేశాడు. అటు ఇంజినీరింగ్, ఇటు డిగ్రీ పట్టా చేతిలో పడ్డాక అతని జాబుల దండయాత్ర మొదలైంది..
9ఏళ్లు సిటీలోనే..
ఆరు జాబులు కొడతా అని మాత్రం ఊహించలేదు. వీఆర్‌వో, గ్రూప్–4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు రాసి మార్కులు చూసుకున్నాక నాకు వస్తాయని కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ జీహెచ్‌ఎంసీ వర్క్ ఇన్స్‌పెక్టర్ జాబ్ వస్తదని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలే. అనుకోకుండానే వచ్చిందనిపించింది. ప్రస్తుతం మల్యాల వీఆర్‌వోగా పనిచేస్తున్నా. గ్రూప్–4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో నాకు జిల్లా సెకండ్ ర్యాంకు వచ్చింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోంది. గ్రూప్–4 జాబులోనే జాయినవుదాం అనుకుంటున్నా. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలని నా కోరిక. మా బంధువులంతా అందులోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా చేరితే నేను రిటైరయ్యేవరకు ఆర్డీవో స్థాయివరకు వెళ్తానని అనుకుంటున్నా. జీహెచ్‌ఎంసీలో రెండు పోస్టులు వచ్చినప్పటికీ నాకు హైదరాబాద్‌లో ఉండాలని లేదు. బీటెక్ ప్లస్ ప్రిపరేషన్ కోసమని 9 ఏళ్లు అక్కడే ఉన్నా. ఇంకా అక్కడే జాబ్ అంటే అమ్మానాన్నల్ని వదిలి ఉండాల్సి వస్తుంది. అందుకే వద్దనుకుని మా ఊరి దగ్గరే వీఆర్‌వో పోస్టులో చేరా. ఇప్పుడు ఇంటిదగ్గర నుంచే వెళ్తున్నా. అమ్మ చేతి వంట తింటూ నాన్న పనిలో సాయపడుతుంటే ఇంతకంటే ఆనందం ఏముంటుంది అన్పిస్తది.
లాంగ్ లీవ్ పెట్టి చదువుతా..
2013 నుంచి 2018 దాకా 5 సంవత్సరాలు వెయిట్ చేసిన ఏదో ఒక జాబ్ కొట్టకపోతనా అని. అది కాకుండా ఏరా ఏం చేస్తున్నవు అని రిలేటివ్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సరిగ్గా సంవత్సరంపాటు ఇంటికి పోలేదు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నరు అని అమ్మానాన్నల్ని ఫోన్‌లోనే అడిగేవాణ్ని. ఇప్పుడు జాబ్‌లు వచ్చాక వాళ్లే ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నరు. లైఫ్ అంటే ఇదే కదా అన్పిస్తది. నాన్న మల్లేశం తాళ్లు ఎక్కుతడు(కల్లు గీస్తడు). అమ్మ రేణుక బీడీలు చేస్తది. తమ్ముడు భరత్ ఎంబీఏ చదువుతున్నడు. భవిష్యత్తులో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ వస్తే లాంగ్ లీవ్ పెట్టి మరీ ప్రిపేరవుతా. అదే నా లక్ష్యం.
– జగిత్యాల, కొడిమ్యాల, వెలుగు