Jai Hanuman: జై హనుమాన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. ప్రశాంత్ ప్లానింగ్ అదుర్స్

హనుమాన్(HanuMan).. ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాగా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varama) తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కథ, కథనం, విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ప్రేక్షకులు హనుమాన్ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది మూవీ.

సూపర్ హీరో కాన్సెప్ట్ కి హిందూ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్స్ లో హనుమాన్ ను క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయిపోయారు. సాక్షాత్తు హనుమంతుల వారిని చూసిన అనుభూతితో చాలా మంది చేతులెత్తి నమస్కారం చేశారు. అంతలా ఆడియన్స్ ను కట్టిపడేశాడు ప్రశాంత్. ఇక సినిమా చివర్లో హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.

ఇటీవల సంక్రాంతి కానుకగా జై హనుమాన్ కథ పూర్తయిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయనే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ను ఖుషీ చేశాడు. ఇక తాజాగా జై హనుమాన్ సినిమా గురించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ లో ఉన్నాడట ప్రశాంత్. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నాడట. హనుమంతుల వారి సినిమాకు శ్రీరామ నవమి కన్నా ప్రత్యేకమైన రోజు ఇంకేం ఉంటుంది. అందుకే అదే రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రశాంత్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్. దీంతో జై హనుమాన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.