రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులపై బలమైన మహిళా అభ్యర్థులను నిలబెట్టి.. వారిని చిత్తుగా ఓడిస్తామని జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంతవిష్ణు ప్రభు అన్నారు. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ జాతీయ కార్యాలయంలో రెండో జాబితాను విడుదల చేశారు. 11స్థానాల్లో మహిళా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
119 స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించనునట్లు చెప్పారు. నవంబర్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 50 వేల మందితో మహిళా గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం, అందిస్తామని హామీ ఇచ్చారు. భూలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 200 గజాల స్థలం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి 32 వేలు విలువ చేసే సోలార్ స్టవ్ ఉచితంగా ఇస్తామన్నారు.
ALSO READ : బీజేపీ బీసీ అధ్యక్షుడిని తొలగించి.. ఇప్పుడు బీసీ సీఎం అంటోంది: కేటీఆర్
ఎల్పీజీ గ్యాస్ ను నిషేధించి.. ప్రతి ఇంటికీ 50 రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్, వంటింటికి సరిపడా నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీ 100 శాతం మహిళలకు టికెట్లు కేటాయించలేదని... జై మహా భారత్ పార్టీ మహిళలకు పెద్ద పీట వేస్తోందని అనంతవిష్ణు ప్రభు చెప్పారు.