సన్నబియ్యం పైపైకి.. ప్రతి నెలా ధర పెంచుతున్న వ్యాపారులు

  • సన్నబియ్యం పైపైకి.. 
  • సాగు తగ్గడం, డిమాండ్​ పెరగడంతో ప్రతి నెలా ధర పెంచుతున్న వ్యాపారులు
  • గతేడాదితో పోలిస్తే అన్ని రకాలకు వెయ్యికి పైగా పెరిగిన రేట్లు
  • గడిచిన రెండు నెలల్లో రూ.300 పెరిగిన రేటు  
  • రూ.6 వేలకు పైగా పలుకుతున్న జై శ్రీరాం బ్రాండ్​ రైస్​

జగిత్యాల, వెలుగు :  రాష్ట్రంలో సన్నాల సాగుతగ్గి, సన్న బియ్యానికి డిమాండ్​ ఏర్పడడంతో వ్యాపారులు రేట్లను పెంచేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే అన్ని రకాలపై ఇప్పటికే వెయ్యి రూపాయల దాకా పెంచిన వ్యాపారులు, తాజాగా ఏర్పడ్డ కొరతను సాకుగా చూపి, చాలా జిల్లాల్లో గడిచిన రెండు నెలల్లోనే ఏకంగా రూ.300 దాకా రేట్లు పెంచేశారు. ప్రస్తుతం దేశంలో సన్నబియ్యానికి కొరత ఏర్పడడంతో విదేశీ ఎగుమతులపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే అదనుగా స్థానికంగా సన్న బియ్యాన్ని  బ్లాక్​ చేస్తున్న ఆఫీసర్లు , ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ప్రతి సీజన్​లో వడ్ల కొనుగోళ్లు, సీఎంఆర్​ కోసం మిల్లర్లను, వ్యాపారులను బతిమిలాడే స్థితికి చేరిన సర్కారు, బియ్యం రేట్లపై  వారిని కంట్రోల్​ చేయలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రోత్సాహం లేక తగ్గుతున్న సన్నాల సాగు..

కొన్నేండ్లుగా రాష్ట్రంలో  జై శ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, జగిత్యాల  సోనా, తెలంగాణ సోనా లాంటి  సన్నాలు సాగుచేస్తున్న రైతులకు కష్టనష్టాలు పెరుగుతున్నాయి. దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాలకు ప్రతి ఎకరాపై  రూ.10 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తీరా దొడ్డు రకాల కంటే  4 నుంచి 5క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వస్తుండడంతో సన్నాల సాగుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. సర్కారు చెప్పడంతో 2021, 2022 వానకాలం సీజన్లలో సన్నాలు సాగు చేసిన రైతులు చీడపీడల కారణంగా దెబ్బతిన్నారు. పైగా కొనుగోలు సెంటర్లలో సన్నాలను కొనకపోవడంతో మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.300కు తక్కువగా అమ్ముకొని నష్టపోయారు. సర్కారు తీరుపై విమర్శలు రావడంతో క్వింటాల్​కు రూ.100 అదనంగా ఇచ్చేలా చూస్తామని 2021లో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చినా అమలుచేయలేదు.  దీంతో 2022 వానకాలం సీజన్​ నుంచే  రైతులు సన్నాల సాగు తగ్గిస్తున్నారు. ఈ 2023 వానకాలం సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటికే 44 లక్షల ఎకరాల్లో నాట్లు వేస్తుండగా, ఇందులో 11 లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగయ్యే పరిస్థితి లేదని అగ్రికల్చర్ ఆఫీసర్లే చెప్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో సన్నబియ్యం కొరత మరింత ఉండే అవకాశం కనిపిస్తోంది.

పక్క రాష్ట్రాల్లోనూ డిమాండ్​.. 

గతంలో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాల్లో జనం దొడ్డు బియ్యం తినేందుకు మొగ్గుచూపేవారు. కానీ, క్రమంగా కొన్నేండ్ల నుంచి ఆయా రాష్ట్రాల ప్రజలు సన్నబియ్యం తినేందుకు ఇష్టపడ్తున్నారు. విదేశాల్లో కూడా సన్నబియ్యానికి డిమాండ్​ పెరగడంతో మన రాష్ట్రం నుంచి ఎగుమతులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కొరతను సాకుగా చూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు. గతేడాదితో పోలిస్తే అన్ని సన్నరకాలపై ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి  దాదాపు వెయ్యి రూపాయలు పెంచిన వ్యాపారులు, మార్చి నుంచి మే వరకు సైలెన్స్​గా ఉన్నారు. తాజాగా జూన్​, జులై నెలల్లో ఏకంగా 30‌‌0 దాకా పెంచేశారు.   

సన్న బియ్యం పిరమైతన్నయ్

మార్కెట్​లో సన్నబియ్యం రేట్లు విపరీతంగా పెంచుతున్నరు.  నెల రోజుల్లోనే క్వింటాల్​కు రూ.500 దాకా పెంచిన్రు. దొడ్డు బియ్యం తినాలంటే కష్టంగా ఉంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సన్న బియ్యం రేట్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలె.  - తిరునగరి రమణ, కోరుట్ల

సర్కారు ప్రోత్సహించాలె

 సర్కార్  చెప్పడం తో గతంలో సన్నవడ్లు పండించాను. దొడ్డు వడ్ల సాగుతో పోలిస్తే చీడపీడలు ఎక్కువ కావడంతో పెట్టుబడులు పెరిగినయ్​. దిగుబడి కూడా తక్కువ వచ్చింది. సెంటర్లలో కొనకపోవడంతో మిల్లర్లకు తక్కువకు అమ్ముకున్నం. సన్నాల సీడ్​ను సబ్సిడీపై ఇచ్చి, వడ్లను మద్దతు రేటు కంటే కనీసం రూ.500 ఎక్కువ ఇవ్వాలి. అప్పుడే నాలాంటి రైతులు సన్నాలను సాగుచేసే అవకాశం ఉంటది. - నలిమెల మహేశ్​, రైతు, పాశిగామ, వెల్గటూర్.