- ఓ వర్గం ఓట్ల కోసమేనని చర్చ
- చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ వేడుకలు
- ఖమ్మంలో జరిగిన సంబురాల్లో పాల్గొన్న మంత్రి అజయ్, మాజీ మంత్రి తుమ్మల
- సత్తుపల్లిలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ‘జై తెలుగుదేశం’ అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన సందర్భంగా టీడీపీ అభ్యర్థులు నిర్వహించిన వేడుకల్లో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం లకారం ట్యాంకు బండ్ సమీపంలోని ఎన్టీఆర్విగ్రహం దగ్గర టీడీపీ శ్రేణులు నిర్వహించిన సంబురాల్లో ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చారు. ఇందులో పాల్గొన్న మంత్రి అజయ్ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ గతంలో నిర్వహించిన ర్యాలీకి తాను సంఘీభావం తెలిపినట్టు గుర్తు చేశారు. ‘మంత్రి హరీశ్‌రావు సమక్షంలోనే చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని, అరెస్టును ఖండించాను. చంద్రబాబు లాంటి జాతీయ నేత గతంలో ఉమ్మడి ఏపీని పరిపాలించి, భారతదేశంలో ఉన్నతమైన స్థాయిలో నిలిపారు. చంద్రబాబు గారికి అత్యంత ఆప్తులైన మా నాన్నగారు 52 రోజులపాటు ప్రతిరోజూ ఆయన ఎప్పుడు విడుదలవుతారా అని ఎదురుచూశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబు విడుదలైన సందర్భంగా, న్యాయం గెలిచిన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని మంత్రి అజయ్ అన్నారు.
దేవాలయానికి రావడం సంతోషాన్నిచ్చింది : తుమ్మల నాగేశ్వర్ రావు
ఇక కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏకంగా ఇతర కాంగ్రెస్‌నేతలతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలుజల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ‘నా రాజకీయ ప్రస్థానం మొదలైన దేవాలయానికి రావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ రాజకీయ వరమిస్తే, చంద్రబాబు పెంపకంలో నిబద్దతతో, క్రమశిక్షణగా ఎదిగా. పార్టీ మూల సిద్ధాంతాన్ని, క్రమశిక్షణను భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తా. అక్రమ కేసుల్లో బందీ అయిన చంద్రబాబు తాత్కాలిక బెయిల్ పై రావడంతో నాకు వచ్చిన సంతోషాన్ని మీతో పంచుకోవాలని వచ్చా. మరో నెల పాటు జరిగే నా ప్రచార కార్యక్రమాల్లోనూ ఇవే కేరింతలతో, ఉత్సాహంతో పాల్గొనాలి. నిజాయితీ, పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నా విజయంలో భాగస్వాములు కావాలి’ అని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
సత్తుపల్లి వేడుకల్లో పాల్గొన్న సండ్ర
సత్తుపల్లిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కల్లూరులో భారీగా పటాకులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. మధిరలో బీఆర్ఎస్ నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు కూడా చంద్రబాబు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలో ఉన్న ఓ వర్గం ఓట్లకోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇలా పోటీ పడి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే చర్చ పొలిటికల్సర్కిల్స్లో జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ జరిగిన సమయంలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు నిర్వహించిన ర్యాలీల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.