శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం మద్యం మత్తులో ఎయిర్ పోర్టు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన జైలర్ సినిమా నటుడు వినాయకన్‌ను ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీఐఏ ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 4.30 గంటలకు కొచ్చి నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వినాయకన్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు.
ఇక్కడి నుంచి గోవాకు వెళ్లేందుకు ప్లైట్ మారే సమయంలో మద్యం మత్తులో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. నిందితుడు వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని సిటీ పోలీస్ యాక్ట్, న్యూసెన్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ బాలరాజు వెల్లడించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై వినాయకన్ బూతులు తిడుతూ చిందులు తొక్కాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక విచారణ అనంతరం వినాయకన్‌ను విడిచిపెట్టారు.