మెదక్​ జిల్లాలో బయటపడుతున్న..జైన ఆనవాళ్లు

మెదక్​ జిల్లాలో బయటపడుతున్న..జైన ఆనవాళ్లు
  • వివిధ ప్రాంతాల్లో నాలుగు పార్శ్వనాథుని విగ్రహాలు

మెదక్, టేక్మాల్, వెలుగు : మెదక్ జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. గతంలో వివిధ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతంలో అంతకు ముందు జైనమతం వర్ధిల్లింది. అప్పట్లో అద్భుతమైన జైన మందిరాలు నిర్మించారు. వాటిల్లో జైన మత తీర్థంకరుల భారీ ఏకశిలా విగ్రహాలు ప్రతిష్టించారు. ఆయా చోట్ల జరిపిన తవ్వకాల్లో అందుకు సంబంధించిన ఆనవాళ్లు బయట పడుతున్నాయి. కాకతీయుల కాలం వరకు ఒక వెలుగు వెలిగిన జైనం కాల క్రమంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. కాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జిల్లాలో మరుగున పడిన జైన మత చరిత్రను వెలికి తీస్తున్నారు.

కొల్చారంలో..

కొల్చారంలో వీరభద్ర స్వామి గుడి పక్కన 1984లో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా 9 అడుగుల పొడవు, దాదాపు రెండు టన్నుల బరువు ఉన్న పార్శ్వనాథుని ఏకశిలా విగ్రహం బయటపడింది. స్థానికులు గ్రామదేవుడిగా భావించి పూజలు చేయగా కొన్నాళ్లకు ఆ విగ్రహం గురించి తెలుసుకున్న జైన మతస్తులు దానిని హైదరాబాద్ తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అందుకు గ్రామస్తులు అంగీకరించకపోవడంతో ఆలిండియా జైన్​ దిగంబర్​ మహాసభ ముందుకు వచ్చి గ్రామస్తుల కోరిక మేరకు హైదరాబాద్ మెదక్​ నేషనల్ హైవే పక్కన గుడి నిర్మించారు.  

క్రీస్తు శకం 9,10 వ శతాబ్దంలో తెలంగాణ, కర్నాటక ప్రాంతాన్ని పాలించిన కల్యాణి చాళుక్యుల కాలానికి చెందిన ఈ విగ్రహం ఏడుపడగల పాము నీడలో నల్లరాతి శిల్పంతో చెక్కి ఉంది. పద్మం మీద నిలబడిన భంగిమలో ఉన్న విగ్రహం పూర్తిగా దిగంబరంగా ఉంది. పాదాల వద్ద చెక్కిన శాసనం'చాళుక్య కుల తిలకం తైలపరసన్' అని ఉంది. ఈ విగ్రహం క్రీస్తు శకం 973 – -995 కాలానికి చెందిన విలువైన విగ్రహం. జైనంలో 24 తీర్థంకులకు ఒక్కొక్క తీర్థంకునికి ఒక్కొక్క జంతువు ప్రత్యేకంగా ఉంటుంది. ఏడు పడగల పామును  బట్టి కొల్చారంలో బయల్పడిన విగ్రహం 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథునిగా పోల్చుకోవచ్చని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్​ తెలిపారు. 

వేల్పుగొండలో.. 

టేక్మాల్ మండలం వేల్పుగొండ శివారులోని చెరువు మధ్యలో ఉన్న దేవతల గుట్ట మీద ఒక పురాతన పార్శ్వనాథుని విగ్రహం లభించింది. దీనికి సంబంధించి ఎలాంటి శాసనాలు లేకపోవడం వల్ల అది ఏనాటి కాలనిదో తెలియలేదు. కానీ కల్యాణి చాళుక్యుల నాటిదని ఊరిలోని గుడినిబట్టి చరిత్రకారులు అంచనాకు వచ్చారు. పార్శ్వనాథుని తలపై ఏడు పడగల పాము రక్షణగా ఉంది. కొద్ది రోజుల కింద హైదరాబాద్​నుంచి కొందరు దొంగలు వచ్చి గుట్ట మీద ఉన్న ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి  తరలించుకుపోయారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి హైదరాబాద్​నుంచి విజయవాడ వెళ్లే దారిలో ఆ విగ్రహాన్ని పట్టుకున్నారు. 

ఇదే వేల్పుగొండలో దేవతల గుట్టపైన మరో ధ్వంసం చేయబడిన జైన తీర్థంకరుని విగ్రహం దొరికింది. ఈ విగ్రహానికి  సంబంధించిన తల గ్రామంలోని పశు వైద్యశాల దగ్గర లభించింది. వేల్పుగొండలో ఉత్తర దిక్కున ఉన్న రామాలయం గుట్ట మీదకు వెళ్లేదారిలో కుడి వైపున పెద్ద బండరాతికి జైనమత 23వ తీర్థంకుని పార్శ్వనాథుని విగ్రహం చెక్కబడి ఉంది. ఇక్కడ పార్శ్వనాథునితో పాటు జైన యక్షిని ధర్మేంద్రుడి రూపం కూడా చెక్కబడి ఉంది. ఇలాంటి రాతి చెక్కడాలు తమిళనాడు, కర్నాటకలో కూడా బయటపడ్డాయని బుర్ర సంతోష్​ తెలిపారు.