జైనూర్, వెలుగు: పంట రుణమాఫీతోపాటు రైతుబంధు డబ్బులు అందడంలేదని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ఆదివాసీ రైతులు గురువారం జైనూర్‌లో భారీ ధర్నా చేపట్టారు. ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని బ్యాంక్ మేనేజర్, పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తమ ఖాతాలోని రైతుబంధు డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్తే అకౌంట్ హోల్డ్‌లో ఉందని బ్యాంకర్లు చెప్తున్నారని, క్రాప్ లోన్ అప్పు చెల్లిస్తేనే హోల్డ్ తొలగిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రాప్ లోన్‌కు పోడు రైతులు దూరం
అటవీ హక్కు పత్రాలున్న రైతులు క్రాప్ లోన్ అప్పులు చెల్లించి అకౌంట్ క్లోజ్ చేసుకోవాలని బ్యాంకర్లు తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు చెల్లించినప్పటికీ తిరిగి లోన్ ఇవ్వడానికి ఆదేశాలు లేవని జైనూర్ బ్యాంక్ ఫీల్డ్ అఫీసర్ చెప్తున్నారని పేర్కొన్నారు. దీంతో పోడు భూములు సాగుచేసుకుంటున్న అటవీ హక్కు పత్రాలున్నా పంట రుణాలకు దూరమవుతున్నారని రైతులు వాపోయారు. కొత్తగా అటవీ హక్కు పత్రాలు పొందిన వారికి కూడా రుణసదుపాయం కల్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.