జైనూరు ఆదివాసీ మహిళ గాంధీ నుంచి డిశ్చార్జి

జైనూరు ఆదివాసీ మహిళ గాంధీ నుంచి డిశ్చార్జి
  • బాధితురాలికి కొత్త బట్టలు, నగదు సాయం అందించిన మంత్రి సీతక్క
  • మంత్రికి థ్యాంక్స్​ చెబుతూ కంటతడి పెట్టిన బాధితురాలు
  • డిశ్చార్జ్​ సందర్భంగా భావోద్వేగం

పద్మారావునగర్, వెలుగు: ఆటో డ్రైవర్​దాడిలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో నెల రోజులగా ట్రీట్‌మెంట్​ తీసుకుంటున్న ఆసిఫాబాద్ ​కుమ్రం భీం జిల్లా జైనూరుకు చెందిన ఆదివాసీ మహిళ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డాక్టర్లు ఆదివారం డిశ్చార్జ్​ చేశారు. ఈ సందర్భంగా దవాఖానకు వచ్చిన మంత్రి సీతక్క ఆమెను దగ్గరుండి స్వగ్రామానికి పంపించారు. నెల కింద జైనూరులో దుండగుడు చేసిన దాడిలో ఆదివాసీ మహిళ లీలాబాయి తీవ్రంగా గాయపడటంతో ఆదిలాబాద్​ రిమ్స్​ దవాఖానకు, ఆపై గాంధీ హాస్పిటల్​కు తరలించారు. 

ముఖంపై తీవ్ర గాయాలై ముఖ భాగం ఎముకలు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క పలుమార్లు గాంధీ దవాఖానకు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందచేసి భరోసా కల్పించారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు డాక్టర్లకు ఫోన్​చేసి బాధితురాలి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితురాలి ముఖం ఛిద్రం కావడంతో డాక్టర్లు స్పెషల్​ కేర్​ తీసుకొని ప్లాస్టిక్​సర్జరీతో పాటు పలు ఆపరేషన్లు చేశారు. 

నెలరోజుల వైద్యం తర్వాత కోలుకున్న బాధితురాలిని ఆదివారం డిశ్చార్జి చేస్తున్నారని తెలుసుకున్న మంత్రి సీతక్క దవాఖానకు వచ్చి, బాధితురాలికి కొత్త బట్టలు, కొంత నగదు అందజేశారు. డాక్టర్లు ఆమెకు అవసరమైన మందులను ఇచ్చారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఆమెను తోడ్కొని వార్డు నుంచి మెయిన్ ​బిల్డింగ్ పోర్టికో వరకు స్వయంగా తీసుకువచ్చి, కారులో కూర్చోబెట్టి జైనూరుకు పంపించారు. 

ఈసందర్బంగా బాధితురాలు ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు. తనను కంటికి రెప్పలా చూసుకున్న మంత్రి సీతక్కకు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా తనను సంప్రదించాలని మంత్రి ఆమెను ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబసభ్యులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్​చార్జ్ ఆత్రం సుగుణ, గాంధీ ఆస్పత్రి ఆర్​ఎంవో డాక్టర్​ సరిత, హెల్త్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​ సిబ్బంది ఉన్నారు.