తెలంగాణ సత్తాను ఢిల్లీలో చాటిన రాజకీయవేత్త జైపాల్ రెడ్డి. పార్లమెంటులో ఆయన మాట్లాడటానికి లేస్తే అందరూ సైలెంట్ అయి పోయేవారు. జైపాల్ ఏం మాట్లాడతారోనని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్లు. ఆయన ప్రతి మాటను శ్రద్ధగా వినేవాళ్లు. దీనికి కారణం ఒకటే ఆయన గాలిపోగేసి మాట్లాడే టైపు పొలిటీషియన్ కాదు. మాట్లాడాల్సిన టాపిక్ పై బాగా హోం వర్క్ చేసేవారు. సబ్జెక్ట్ ను బాగా స్టడీ చేసేవారు. పరీక్ష రాయడానికి వెళ్లే స్టూడెంట్ లా అన్ని అంశాలు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేవారు. ఆ తర్వాత మాట్లాడటం మొదలెట్టేవారు.
ఈ హోం వర్క్ కు ఇంగ్లీషు పై ఆయన కున్న పట్టు ప్లస్ పాయింట్ గా మారింది. అవసరమైనప్పుడు ఛలోక్తులు విసురుతూ ఆయన ప్రసంగించే వారు. వీటన్నిటికి తోడు ఆయనది అద్భుతమైన వాగ్ధాటి. ఏం మాట్లాడినా సబ్జెక్ట్ వరకే ఆయన పరిమితమయ్యేవారు. అనవసరమైన ఒక్క పదం కూడా ఆయన నోటివెంట వచ్చేది కాదు. కాంగ్రెస్ లో ఉన్నా, జనతా పార్టీలో కొనసాగినా, యునైటెడ్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించినా ఈ లక్షణమే ఆయన్ను పార్లమెంటులో ఓ హీరో ను చేసింది. దీంతో 1998లో ‘ బెస్ట్ పార్లమెంటేరియన్ ’ అవార్డు ఆయనకు దక్కింది.
పార్లమెంటులో చురుగ్గా పాల్గొని మంచి ప్రసంగాలు చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. 1992 లో అప్పటి లోక్ సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. అయితే 1992 నుంచి 1998 వరకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన వారిలో సౌత్ ఇండియన్ ఎవరూ లేరు. అప్పటివరకు ఈ అవార్డు పొందిన వారిలో ఇంద్రజిత్ గుప్తా (1992), అటల్ బిహారీ వాజ్ పేయి ( 1994), చంద్రశేఖర్ ( 1995), సోమనాథ్ ఛటర్జీ (1996), ప్రణబ్ ముఖర్జీ (1997 ) ఉన్నారు. ఇలాంటి దిగ్గజాల సరసన జైపాల్ రెడ్డి కూడా చేరారు. దక్షిణాది వాడైన జైపాల్ 1998లో అప్పటివరకు ఉన్న ట్రెండ్ ను బ్రేక్ చేసి అవార్డును సొంతం చేసుకున్నారు.
స్టూడెంట్ లీడర్ గా తొలి అడుగులు
ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన రాజకీయ జీవితానికి తొలి అడుగు పడింది. ఇక్కడే ఆయన స్టూడెంట్ లీడర్ గా పొలిటికల్ జర్నీ మొదలెట్టారు. 1969 లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన తనదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే వారు. 1975 లో ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఇందిర నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి జనతా పార్టీలో చేరారు. 1978లో జనతా పార్టీ కేండిడేట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో అసెంబ్లీలో జనతా పార్టీ కి గౌతు లచ్చన్న ఫ్లోర్ లీడర్ కాగా జైపాల్ రెడ్డి డిప్యూటీ ఫ్లోర్ లీడర్. అసెంబ్లీలో తన మార్క్ మాటల తూటాలతో అప్పటి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని గడగడలాడించేవారు. 1980 లో జనతా పార్టీ కేండిడేట్ గా మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.
1984 లో తొలిసారి పార్లమెంటుకు ….
పాలమూరు లోక్ సభ సీటు నుంచి 1984లో ఆయన పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఏ అంశంపైనయినా ఆయన బాగా చదివేవారు. సభలో అనర్గళంగా మాట్లాడేవారు. 1985 నుంచి 88 వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జైపాల్ ది పొలిటికల్ గా లాంగ్ ఇన్నింగ్స్. అయినా ఆయన రాజకీయ జీవితం పై ఎక్కడా అవినీతి మరక పడలేదు. నిజాయితీకి నిలువుటద్దంలా నిలిచారు.