సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు కుట్ర: జైపాల్ యాదవ్

సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు కుట్ర:  జైపాల్ యాదవ్

కల్వకుర్తి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆరోపించారు. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ కు  ఠాక్రే లేఖ రాశారని తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేనప్పుడు అది మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు ఏం గ్యారెంటీ ఉన్నదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​కు రైతులే బుద్ధి చెప్తరు

మక్తల్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి రైతులే ఓటుతో బుద్ధి చెపుతారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​ రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి ఆంజనేయగౌడ్​అన్నారు. గురువారం ఎమ్మెల్యే చిట్టెం ఇంట్లో ప్రెస్​మీట్​నిర్వహించారు. రైతు బంధు అందకుంటే కాంగ్రెస్ ను మరో ఐదేళ్ల పాటు ఇంటికి పంపేందుకు ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్​ రైతుల మేలు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లుగా ఉన్న పొలాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని తెలిపారు.  

అడ్డుకోవాలని చూస్తే ఊళ్లో తిరగనివ్వం

మహబూబ్ నగర్ టౌన్/హన్వాడ/ ఆమనగల్లు, వెలుగు : కాంగ్రెస్​ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అడ్డుకోవాలని చూస్తే వారిని ఊళ్లో తిరగనివ్వబోమని పలువురు బీఆర్​ఎస్​ లీడర్లు హెచ్చరించారు. గురువారం మహబూబ్ నగర్ లో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్,  హన్వాడలో ఎంపీపీ బాలరాజు , సింగిల్ విండో చైర్మన్ వైస్ చైర్మన్లు వెంకటయ్య, కృష్ణయ్య గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు.

రైతుబంధు పథకం నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు. ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టిస్తోందన్నారు.