ప్రేమ పెళ్లి.. అనుమానంతో హత్య: అనాథగా 3 నెలల పాప

ఒకే కంపెనీలో పని చేస్తూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమ చిగురించి.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల పాటు కలిసి కాపురం చేశారు. వారికి మూడు నెలల పాప కూడా ఉంది. కానీ, భార్య నిరంతరం సోషల్ మీడియాలో టైమ్ స్పెండ్ చేస్తుండడంతో ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమోనని అనుమానం వచ్చి ఆమెను చంపేశాడు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ దారుణం జరిగింది.

జైపూర్ కు చెందిన అయాజ్ అహ్మద్ (25), రేష్మా మంగ్లానీ (22) జంట రెండేళ్ల క్రితం ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేసేవారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. జీవితాంతం ఒకటిగా బతకాలనుకున్న వారిద్దరూ పెద్దలను ఒప్పించలేకపోయారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. జైపూర్ సిటీలో ఇద్దరూ సపరేట్ గా కాపురం పెట్టారు. కొన్నాళ్లకు అమ్మాయి తల్లిదండ్రులు వారిని చేరదీసి.. ముస్లిం సంప్రదాయంలో నిఖా చేశారు. వారి ప్రేమకు ఫలితంగా మూడు నెలల క్రితం పండంటి ఆడ బిడ్డ జన్మించింది.

కుటుంబ పోషణ కోసం ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న వఅయాజ్ కు తన భార్య ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో అభద్రతా భావం నెలకొంది. రేష్మాకు ఫేస్ బుక్ లో దాదాపు 6 వేల మంది ఫ్రెండ్స్ ఉండడంతో ఆమె ఎవరితోనో వివాహేతర బంధం నడుపుతోందని అనుమానంతో తరచూ గొడవ పడేవాడు అయాజ్. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె ఇటీవలే తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లిన అయాజ్ మనస్పర్థలు మామూలే సర్దుకుపోదామంటూ తనతో ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడ బీర్ తాగి.. సరదాగా స్కూటీపై రైడ్ అంటూ రేష్మాను బయటకు తీసుకెళ్లి సిటీ దాటాక ఆమెను హత్య చేశాడు. శవాన్ని గుర్తుపట్టకుండా చేయాలని పెద్ద బండరాయిని ముఖంపై ఎత్తేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అయాజ్ ఈ దారుణానికి పాల్పడిన కొన్ని గంటల్లోనే సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.