
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కొత్తగా 800 మెగావాట్ల మూడో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర సర్కారుఆమోదం తెలపడంతో ప్లాంట్ నిర్మాణానికి మరోసారి టెండర్లు పిలవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్) ని విస్తరించి కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మూడో ప్లాంట్ ఏర్పాటుకు అడుగు ముందకు పడింది. దీంతో ఈ ప్లాంట్ లో స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది.
2015 మార్చిలో మూడో యూనిట్‌కు శంకుస్థాపన
జైపూర్ మండలం పెగడపల్లిలో 2011 నవంబర్ 11న 1200 మెగావాట్ల (2×600) సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) ను ప్రారంభించారు. రెండు యూనిట్ల ద్వారా రోజుకు 28.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాల్లో సుమారు 15 శాతం ఎస్టీపీపీ ద్వారా తీరుతోంది. విద్యుత్ విక్రయాలతో ఏటా రూ.500 కోట్లకు పైగా ఆదాయాన్ని సింగరేణి ఆర్జిస్తోంది. సింగరేణి సంస్థకు ఇక్కడి వనరులు అనుకూలించడం, అంచనాకు మించి సేకరించిన భూములతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను విస్తరించేందుకు అదనంగా మరో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015 మార్చిలో మూడో యూనిట్ పనులకు (అప్పుడు 600 మెగావాట్లకే) అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
రూ.6,800 కోట్ల ఖర్చుతో ఈ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. కానీ నిధుల సమీకరణలో జాప్యం జరిగింది. పర్యావరణానికి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో సబ్ క్రిటికల్ థర్మల్ కేంద్రాలకే (కాలుష్యం తగ్గించేవి) కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఈ విధానంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి చాన్స్ లేకపోవడంతో మూడో యూనిట్‌ను 600 నుంచి 800 మెగావాట్లకు సింగరేణి పెంచింది. 2019 మార్చి 7న మూడో యూనిట్ కోసం పొల్యూషన్ బోర్డు విచారణ నిర్వహించింది. సెంట్రల్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లు 2019 డిసెంబర్18న అనుమతి ఇచ్చారు.
ఆసక్తి చూపని గత బీఆర్ఎస్ సర్కారు
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా మూడో యూనిట్ నిర్మాణంపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు మొదటి నుంచీ ఆసక్తి చూపలేదు. రెండేళ్ల కింద మూడో ప్లాంట్ కోసం సింగరేణి సంస్థ రూ.6,800 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది. టెండర్లలో ఎల్1గా నిలిచిన బీహెచ్ఈఎల్ కంపెనీ కరోనా తర్వాత స్టీల్ ధరల పెరుగుదలతో అదనంగా 20 శాతం వ్యయాన్ని పెంచగా.. ఎస్టీపీపీకి కన్సల్టెంట్‌గా ఉన్న ఎన్టీపీసీ సంస్థ సైతం ఎక్కువ ధర చెల్లించడానికి అంగీకరించలేదు.
దీంతో రెండు సంస్థల మధ్య పలు దఫాలుగా ధరల తగ్గుదలపై చర్చలు జరిగాయి. అయినా బీహెచ్ఈఎల్ వెనక్కి తగ్గకపోవడంతో సింగరేణి సంస్థ ఆ టెండర్లను రద్దు చేసింది. అప్పటి నుంచి మళ్లీ టెండర్లు పిలువడానికి గత బీఆర్ఎస్ సర్కారుచొరవ తీసుకోలేదు.
సీఎం దృష్టికి తీసుకెళ్లిన వివేక్ వెంకటస్వామి
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.. జైపూర్ ఎస్టీపీపీని విస్తరించి 800 మెగావాట్ల మూడో యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్లాంట్ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు. మూడో ప్లాంట్ఏర్పాటు ఆవశ్యకతపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే వివేక్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సింగరేణి ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో సర్కారుమూడో యూనిట్‌కు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. దీంతో ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి మరోసారి టెండర్లు పిలవనుంది.
80 శాతం ఉద్యోగాలు స్థానికులకే
మూడో యూనిట్ ఏర్పాటు చేస్తే సింగరేణికి ఏటా రూ.500 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఎస్టీపీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో ఇప్పటికే సింగరేణి ఓసీపీలు, ఎస్టీపీపీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మూడో యూనిట్ తో స్థానికులకు 800 నుంచి నుంచి వెయ్యి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.