బంగారు ఆభరణాలు కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తాం.. అవి నకిలీవా లేక స్వచ్చమైనవేనా అని జాగ్రత్తగా చూసుకుని కొంటుంటాం..అలాంటప్పుడు కోట్లు పెట్టి కొంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. అమాయకంగా ఉన్నామో అంతే సంగతి.. నకిలీ ఆభరణాలు చూపించి బురిడి కొట్టిస్తారు. ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలా చోట్ల జరిగాయి... తాజాగా ఓ విదేశీ మహిళకు నకిలీ ఆభరణాలు అమ్మి కోట్ల రూపాయలు దండుకున్నారు కేటుగాళ్లు. ఇటీవల ఇండియాను సందర్శించిన చెరిష్ అనే విదేశీయురాలు.. ఓ నగల దుకాణంలో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి మోసపోయింది. కొన్న తర్వాత.. అవి నకిలీ ఆభరణాలు అని తెలిసి ఖంగు తిన్నది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని మనక్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జైపూర్, జోహ్రీ బజార్‌లోని ఓ నగల దుకాణంలో అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ తనకు నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేసింది. తనకు ఇష్టమైన బంగారు ఆభరణాలు కొని ఆనందంతో తిరిగి అమెరికా వెళ్లిన ఆమెక ఊహించని షాక్ తగిలింది. గత ఏప్రిల్‌లో, యుఎస్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో ఇండియాలో కొన్న ఆభరణాలను ఆమె ప్రదర్శించింది. దీంతో అసలు విషయం బయట పడింది. అవి నిజమైన బంగారు ఆభరణాలు కావని.. నకిలీ అని తేలింది. దీంతో ఆమె జైపూర్ కు చేరుకుని షాపు యజమానులను నిలదీసింది.
షాపు యజమాని రాజేంద్ర సోనీ, అతని కుమారుడు గౌరవ్లపై మే18న మనక్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, తమపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని షాపు ఓనర్స్..బాధితురాలిపైనే తిరిగి కేసు పెట్టారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న బాధితురాలు చెరిష్, యుఎస్ ఎంబసీని ఆశ్రయించి సహాయం చేయాలని కోరింది. యుఎస్ ఎంబసీ జోక్యంతో, జైపూర్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి.. నకిలీ ఆభరణాల విక్రయాల మోసాన్ని ఛేదించారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు పరారీలో ఉండగా, నకిలీ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ నార్త్ బజరంగ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "నిందితులు రూ. 300 విలువైన బంగారు పాలిష్‌తో కూడిన వెండి ఆభరణాలను విదేశీ మహిళకు రూ.6 కోట్లకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు.. బాధితురాలికి ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించారు. నకిలీ సర్టిఫికేట్‌ను జారీ చేసిన నంద్ కిషోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి" అని తెలిపారు.