ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసింది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

ఆదివాసీలకు బీజేపీ అన్యాయం చేసింది: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

న్యూఢిల్లీ: ఆదివాసీలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఫారెస్ట్​ రైట్స్​యాక్ట్​ను ధర్తీ అబా జన్​జాతీయ గ్రామ్ ఉత్కర్ష్​ అభియాన్​(డీఏజేజీయూఏ) స్కీమ్​అపహాస్యం చేస్తున్నదని పేర్కొన్నది. ఆదివాసీలను కేంద్ర సర్కారు వంచిస్తున్నదనే దానికి ఇది నిదర్శనమని తెలిపింది. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ (ఇన్​చార్జ్​కమ్యూనికేషన్స్​) జైరాం రమేశ్​ మాట్లాడారు.

బిర్సా ముండా దేశం కన్న గొప్ప పుత్రుల్లో ఒకరని, స్వపరిపాలన, సామాజిక న్యాయానికి దారిచూపిన మహనీయుడని కొనియాడారు. ఆదివాసీలకు కేంద్రం అన్యాయం చేస్తుంటే.. బిహార్​లోని జముయీలో ఆదివాసీలపై మోదీ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. మన్మోహన్​సింగ్​ సర్కారు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ–2006) ఒక విప్లవాత్మక చట్టమని, ఇది అడవులపై అధికారాన్ని అటవీ శాఖ నుంచి గ్రామ సభకు బదిలీ చేసిందన్నారు.