
- మరో ఇద్దరు టెర్రరిస్టులు కూడా.. ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు
- కాశ్మీర్‌లో 4 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్‌లో ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం ఒక టెర్రరిస్టును ఎన్‌కౌంటర్ చేయగా, శనివారం మరో ఇద్దరు టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్ చేశాయి. వీరిని పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించాయి. వీరిలో జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా సహా టెర్రరిస్టులు ఫర్మాన్, బాషా ఉన్నట్టుగా నిర్ధారించాయి. వీళ్ల మీద ఒక్కొక్కరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కిష్త్వార్ జిల్లాలోని నైద్గాం ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 9న భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్‌సెర్చ్ చేపట్టాయి. ఇది తెలిసి టెర్రరిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. ఆనాటి నుంచి నిర్విరామంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఇందులో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ) పాలుపంచుకుంటున్నాయి.
‘‘ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాం. టెర్రరిస్టులందరినీ అంతం చేసే వరకూ ఆపరేషన్ ఆగదు. కొండలు, గుట్టలు, అడవుల్లో ఉగ్రవాదులు దాక్కున్నారు. ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆపరేషన్ చేపట్టడం కష్టంగా మారింది. అయినప్పటికీ భద్రతా బలగాలు ఎంతో ధైర్య సాహసాలతో ముందుకెళ్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో టెర్రరిస్టులను కనిపెడుతున్నాయి. మరోవైపు స్థానికులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి” అని ఆర్మీ కమాండర్ బ్రిగేడియర్ జేబీఎస్ రాఠీ వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటిలో ఏకే–47, ఎం–4 కార్బన్ రైఫిల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉధంపూర్ జిల్లాలోనూ మరో ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు.
ఆర్మీ ఆఫీసర్ వీరమరణం..
టెర్రరిస్టుల ఎదురుకాల్పుల్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) వీరమరణం పొందారు. శుక్రవారం అర్ధరాత్రి కాశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో బార్డర్ గుండా మన దేశంలోకి చొరబడేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు. అది గమనించిన సుబేదార్ కుల్దీప్ చాంద్ తన టీమ్‌తో కలిసి ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టెర్రరిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. సుబేదార్ కుల్దీప్ చాంద్ ధైర్యంగా పోరాడడంతో తీవ్రవాదులు తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయారని, ఆయన ప్రాణత్యాగం మరువలేనిదని ఆర్మీ అధికారులు అన్నారు.